' మాగంటి 'కి నో టిక్కెట్.. తేల్చేసిన చంద్రబాబు
మాగంటి బాబును చంద్రబాబు పక్కన పెట్టేయడం ఖరారైపోయింది. ఆయన స్థానంలో వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు
వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీకి వస్తున్న చంద్రబాబు ఏలూరు లోక్‌సభ అభ్యర్థి విషయంలో కొంత స్పష్టతకు వచ్చినట్లే కనపడుతుంది. 2009 ఎన్నికల నుంచి వరుసగా ఇక్కడ టిడిపి తరఫున ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మాగంటి బాబు పోటీ చేస్తూ వస్తున్నారు. 2009 - 2019లో ఓడిన మాగంటి 2014 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. కాంగ్రెస్‌లో దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన మాగంటి 2009 ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కావూరు సాంబశివరావు చేతిలో ఓడిన మాగంటి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తోట చంద్రశేఖర్ పై లక్షఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇద్దరు కుమారులను కోల్పోవడంతో...
ఇక గత ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ పై 1. 65 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక మూడేళ్లపాటు మాగంటి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మాగంటికి గత ఏడాది కాలంలో తన ఇద్దరు కుమారులను కోల్పోవడం వ్యక్తిగతంగా ఆయనకు పెద్ద లోటే అని చెప్పాలి. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న మాగంటి పెద్ద కుమారుడు రాంజీ, రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి ఇద్దరు నెలల వ్యవధిలోనూ మృతిచెందారు.
గుడ్ బై చెప్పేస్తారనుకున్న....
కుమారుల మరణంతో బాగా కుంగిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారనే అందరూ అనుకున్నారు. అయితే గత ఐదారు నెలలుగా మాగంటి బాగా యాక్టివ్ అవ్వడంతో పాటు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేడర్‌కు దగ్గరవుతున్నారు. పార్టీ కార్యకర్తలకు, కార్యక్రమాలకు సాయం చేస్తూ నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూనే వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా తానే పోటీ చేస్తానని ఆయనే బహిరంగ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
యాక్టివ్ గా ఉండకపోవడంతో....
అయితే పార్లమెంటు పరిధిలో బాబుకు వ్యతిరేకంగా కొందరు గ్రూపులు కడుతుంటే వారికి ఓపెన్‌గానే వార్నింగ్‌లు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది నేనే.. అడ్డెవరు అన్నట్టుగా మాట్లాడుతున్నా.. మాగంటి విషయంలో చంద్రబాబు ఆలోచన మరోలా ఉంది. అయితే వయస్సు ప్రభావంతో మాగంటి గతంలో ఉన్నంత యాక్టివ్‌గా ఉండడం లేదు. ఇటు వచ్చే ఎన్నికల్లో ఆర్థిక అంశం కీలకం కావడంతో ఏలూరుకు సామాజికంగాను, ఆర్థికంగాను బలమైన అభ్యర్థి అవసరం అన్నదే చంద్రబాబు ఆలోచన. పార్టీ భవిష్యత్తు అవసరాలతో పాటు యువత, కొత్త నేతలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు ఏలూరు నుంచి మాగంటిని తప్పించాలని దాదాపు డిసైడ్ అయిపోయారు.
ఇష్యూను క్లోజ్ చేయాలని...
పార్టీ కేంద్ర కార్యాలయ నేతలు, సీనియర్ నేతల అంతర్గత చర్చల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు గా బాబు ఇష్యూను క్లోజ్ చేసేయమని ఓ మాజీ మంత్రికి సూచించినట్టు తెలిసింది. సదరు మాజీ మంత్రి మీరే ఈ విషయాన్ని మాగంటి దృష్టికి తీసుకువెళితే మంచిదని చెప్పారు. రేపో మాపో చంద్రబాబు మాగంటిని పిలిచి ఆయనకే ఈ విషయాన్ని చెప్పనున్నారు. బాబు అనుభవం, మచ్చలేని ఆయన రాజకీయ చరిత్ర నేపథ్యంలో ఆయన సేవలను పార్టీ కోసం వాడుకోవాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.
బాబు ప్లేసులో కొత్త అభ్యర్థి ఎవరంటే...?
మాగంటి పక్కన పెట్టేయడం దాదాపు ఖరారైపోయింది. ఆయన స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ నుంచి టీడీపీ తరపున మాగంటి సమీప బంధువు కొమ్మారెడ్డి రాంబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రబాబు కూడా ఆయన నాయకత్వంపై నమ్మకంతోనూ, ఇష్టంగా ఉన్నారు. ఇక గత ఎన్నికలకు ముందు కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్ ఈ సీటు ఆశించారు. అయితే ఎన్నికల తర్వాత రాజీవ్ పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో ఇప్పుడు ఆయన వైపు చాలా మంది జిల్లా పార్టీ నేతలు కూడా మొగ్గు చూపని పరిస్థితి. ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉంది.