బ్రేకింగ్ : కోమటిరెడ్డి రాజీనామా

తాను ప్రజల కోసమే రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Update: 2022-08-02 14:19 GMT

నెలరోజులుగా తన రాజీనామాపై చర్చ జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పారు. మనసుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోమని తనకు చెప్పారన్నారు. తన రాజనామాపై చర్చ రోజురోజకూ పక్కదారి పడుతుందని కోమటిరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులోనూ చర్చ జరుగుతోంది. నియోజకవర్గ సమస్యలను శాసనసభలో అనేక సార్లు ప్రస్తావించానని, అయినా ఫలితం లేదన్నారు. ఎక్కువ రోజులు నాన్చే ఉద్దేశ్యం తనకు లేదని తెలిపారు.

నియోజకవర్గంలో సమస్యలు...
ప్రతిపక్ష నేత దళితులు ఉండటాన్ని కేసీఆర్ ఓర్చుకోలేకపోయారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక జరిగితేనే నిధులు వస్తాయని అంటున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదన్నారు. ఒక కుటుంబం మాత్రమే తెలంగాణలో పనిచేస్తుంది. మంత్రివర్గం నుంచి అధికారవర్గం వరకూ ఆ కుటుంబం కోసమే పనిచేస్తుందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందన్నారు.
రాజీనామాతోనైనా...
కేసీఆర్ నయా నిజాంలాగా పరిపాలిస్తున్నాడని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా సమస్యలున్నాయన్నారు. ఉప ఎన్నిక వచ్చిన హుజూరాబాద్ లోనే దళితబంధును అమలు చేశారన్నారు. తాను అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్నారు. తన రాజీనామాతోనైనా పింఛన్లు, రేషన్ కార్డుల ఇస్తారన్న ఆశ ఉందన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు సొంత పార్టీలోనూ, బయటా కొందరు ప్రయత్నం చేశారన్నారు. ప్రజల కోసం బతికాం కాని, ఎవరికీ అమ్ముడుబోమని ఆయన తెలిపారు. ఇంకా తన ఎమ్మెల్యే పదవికి 18 నెలల సమయం ఉందన్నారు.
పార్టీకి....
పదవుల కోసం, కాంట్రాక్టుల కోసమే అయితే టీఆర్ఎస్ లో చేరేవాడినని అన్నారు. తాను ప్రజల కోసమే రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటారో మునుగోడు ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు. రాజీనామా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. పన్నెండు మంది ఎమ్మెల్యేలు వెళ్లినా కాంగ్రెస్ అధినాయకత్వం కనీసం పట్టించుకోలేదన్నారు.


Tags:    

Similar News