జడ్పీ ఛైర్మన్ గా....
2009లో చిన్న వయస్సులోనే తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసిన బాపిరాజు ఆ ఎన్నికల్లో ఓడినా ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఇచ్చారు. అయితే బాబు బాపిరాజుకు అన్యాయం చేయకుండా జడ్పీచైర్మన్ పదవి జనరల్ కావడంతో ఆయనకు కట్టబెట్టారు. జడ్పీచైర్మన్‌గా ఉన్న ఐదేళ్లు కూడా నియోజకవర్గంలో టీడీపీ కేడర్ కోసం అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావుతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లోనే వెళ్లారు. చివరకు బీజేపీతో పొత్తు పెటాకులు అవ్వడంతో 2019లో సీటు తనకే వస్తుందని చివరి వరకు ప్రయత్నించారు.
పుట్టినరోజు నాడు...
అయితే జిల్లాలో రెండు ఎంపీ (రాజమండ్రితో కలుపుకుని..), 4 ఎమ్మెల్యే సీట్లు కమ్మ వర్గానికి ఇవ్వడంతో బాపిరాజుకు గూడెం సీటు దక్కలేదు. ఇక గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా యాక్టివ్‌గా లేరు. పరామర్శలు, ఇతరత్రా చిన్నా చితకా వ్యవహారాలతోనే సరిపెట్టేశారు. అయితే ఇటీవల బాపిరాజు బర్త్ డే సాక్షిగా బలప్రదర్శన చేశారు. జిల్లాలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే ర్యాలీ కూడా పెద్ద విజయోత్సవ ర్యాలీలా చేశారు. తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గాల్లోనే కాకుండా మెట్ట ప్రాంతంలో ఉన్న ఆయన అనుచరులు అందరితో కూడా ఆయన టచ్‌లోకి వచ్చేశారు. ప్రభుత్వ అక్రమ కేసులపై ఘాటుగా స్పందిస్తూ దమ్ముంటే తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో ? పెట్టుకోండని సవాల్ విసిరారు.
అనూహ్యంగా బాపిరాజు పేరు...
బర్త్ డేకు ముందు నుంచి కూడా బాపిరాజు పేరు నిడదవోలు ఇన్‌చార్జ్ రేసులో వినిపిస్తోంది. అయితే బర్త్ డే ఫంక్షన్ తర్వాత ఇది మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది. నిడదవోలు 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి మూడుసార్లు టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పోటీ చేశారు. 2009, 2014లో గెలిచిన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయ సన్యాసం చేసేశారు. ఒక్కసారి ఓటమితోనే ఆయన రాజకీయం చేయలేని స్థితికి వచ్చేశారు. ఆయన బాధలు ఆయనవి.. గత ఎన్నికల్లోనే ఆయన టిక్కెట్ కోసం తన సొంత అన్న బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణతో పోటీ పడాల్సిన స్థితి. అటు గత ఎన్నికలకు ముందు కుందుల సత్యనారాయణ కూడా టిక్కెట్ పేరుతో చేసిన హడావిడి.. ఇటు సొంత కుటుంబంలో విబేధాలు ఇవన్నీ ఆయనకు పెద్ద టెన్షన్ తెచ్చిపెట్టాయి.
రిస్క్ తీసుకునేందుకు....
మరోసారి ఇలాంటి రిస్కులు, టెన్షన్లు పడేందుకు శేషారావు సిద్ధంగా లేరు. యేడాదిన్నర క్రితమే ఆయన చంద్రబాబును కలిసి తనకు ఈ సారి సీటు వద్దు.. పార్టీ ఎవరికి సీటు ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పకనే చెప్పేశారు. అలాగే తనను కలుస్తోన్న పార్టీ నేతలతో ఆయన మరోమాట కూడా చెపుతున్నారు. ఈ బాధలు ఎవడు పడతాడు.. ఇప్పుడు కష్టపడినా ఫైనల్‌గా టిక్కెట్ ఇస్తారో ? ఇవ్వరో ? అంటున్నారు. బాబు తనకు సీటుపై కరెక్టుగా హామీ ఇస్తేనే పనిచేస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తేనే ఆయన అనాసక్తత ఏంటో తెలుస్తోంది.
గూడెంలో పట్టున్నా...
ఇక బాపిరాజు విషయానికి వస్తే ఆయన జడ్పీచైర్మన్‌గా ఉన్నప్పుడు జిల్లా అంతటా అనుచరగణం కలిగి ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఆయనకు పట్టున్నా సామాజిక సమీకరణలు కలిసి రావు. ఇప్పటికే ఉన్న నాలుగు కమ్మ సీట్లకు ఐదో సీటు ఇచ్చేందుకు బాబు సిద్ధంగా లేరు. అందుకే నిడదవోలు ఆయనకు బెటర్ ఆప్షన్ కానుంది. ఇక్కడ సొంత సామాజిక వర్గం కూడా బాపిరాజును పోటీ చేయాలని ఆహ్వానిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే శేషారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బాపిరాజు అయితే తమకు అభ్యంతరం లేదని కూడా చెపుతున్నారు. అక్కడ పార్టీ కేడర్ కూడా ఆయనకు ఆహ్వానం పలుకుతోంది. మరి బాపిరాజు నిర్ణయం ఏంటి ? బాబు గారి లెక్కలు ఎలా ఉంటాయన్నది మాత్రమే చూడాలి.