ఎవరీ సునీల్ కనుగోలు? .. కాంగ్రెస్ లో కీలక స్థానం
రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి అప్పటించింది. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూపులో సభ్యుడిని చేశారు
రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి అప్పటించింది. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూపులో సభ్యుడిగా సునీల్ పేరును ప్రకటించారు. ఇటీవల రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ ను 2024 ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ ఫోర్స్ అక్టోబర్ 2వ తేదీ నుంచి మొదలయ్యే రాహుల్ పాదయాత్రతో పాటు అనేక అంశాలను పరిశీలంచి అమలు చేస్తుంది.
టాస్క్ ఫోర్స్ 2024లో...
టాస్క్ ఫోర్స్ 2024 ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయడానికి, ఆర్థిక వ్యవహరాలు చూసేందుకు, కమ్యునికేషన్, మీడియా వ్యవహారాల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రియాంక గాంధీ, చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాతో పాటు సునీల్ కనుగోలు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి చీఫ్ ఎవరూ ఉండరు. ఈ కమిటీదే కీలక నిర్ణయంగా ఉండనుంది.
పీకే కంటే ముందుగానే...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహచరుడిగా సునీల్ కొనుగోలు పనిచేశారు. ఆయన కంటే ముందుగానే మోదీకి సునీల్ కనుగోలు వ్యక్తిగత వ్యూహకర్తగా వ్యవహరించారు. ఎస్కే ఎ బిలియన్ మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సునీల్ కనుగోలు దేశంలోని 14 ఎన్నికల్లో వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సునీల్ కనుగోలుతో కలసి ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేశారు. 2017 ఎన్నికల్లో సునీల్ కనుగోలు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి విజయాన్ని సాధించి పెట్టారు.
14 ఎన్నికలకు..
సునీల్ కనుగోలు శిరోమణి అకాలీదళ్, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకూ వ్యూహకర్తగా వ్యవహరించారు. సునీల్ కనుగోలు పనిచేసిన 14 ఎన్నికల్లో తొమ్మిది ఎన్నికలలో బీజేపీకి, రెండు ఎన్నికల్లో డీఎంకేకు, రెండు ఎన్నికల్లో అన్నడీఎంకేకు, ఒక ఎన్నిక అకాలీదళ్ కోసం 39 ఏళ్ల సునీల్ కనుగోలు పనిచేశారు. అయినా ఆయన పేరు ఎప్పుడూ బయటకు రాలేదు. గుట్టుగా ఉండేందుకే ఆయన ఎక్కవగా ప్రయత్నిస్తారు. సునీల్ కనుగోలు పుట్టింది కర్ణాటకలోనైనా పెరిగింది మాత్రం చెన్నైలోనే. సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ 2024లో కీలక బాధ్యతలను అప్పగించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.