ఘోర పరాభవం.. రెండు స్థానాల్లోనూ ఓడిన పంజాబ్ మాజీ సీఎం
పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఘోర పరాభవం ఎదురైంది. చన్నీ పోటీ చేసిన..
పంజాబ్ లో ఎంతో పట్టున్న కాంగ్రెస్ కు ఆప్ చుక్కలు చూపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ నేతలే కాదు..అకాలీలు కూడా ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి. పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఘోర పరాభవం ఎదురైంది. చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు.
చామ్ కౌర్ సాహిబ్, భదౌర్ రెండు నియోజకవర్గాల నుంచి చన్నీ పోటీ చేయగా.. రెండు చోట్లా ఆయన ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. భదౌర్ నియోజకవర్గంలో చన్నీకి దాదాపు 23 వేల ఓట్లు రాగా, ఆప్ అభ్యర్థికి దాదాపు 57 వేల ఓట్లు వచ్చాయి. చామ్ కౌర్ సాహిబ్ నియోజకవర్గంలో చన్నీకి దాదాపు 50 వేల ఓట్లు రాగా, ఆప్ అభ్యర్థికి దాదాపు 54 వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ లీడింగ్ లో ఉంది. అక్కడ మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను 90 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ఆప్ కు చన్నీ శుభాకాంక్షలు తెలిపారు.