గోకుతూనే ఉంటారట.. గోల చేస్తూనే ఉంటారట

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది

Update: 2022-11-04 04:38 GMT

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు మాట్లాడిన తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. వందల కోట్లను ఎరగా చూపుతుండటం ప్రజాస్వామ్యవాదులను భయపెడుతుంది. అయితే ఈ ఆడియో, వీడియోలకు సంబంధించిన అన్ని ఆధారాలను రాజ్యాంగ వ్యవస్థలన్నింటికీ కేసీఆర్ పంపించారు. కేసీఆర్ బీజేపీకి చెక్ పెట్టేందుకు ఈ రకమైన వ్యూహాన్ని రచించారన్నది అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో బీజేపీని బద్నాం చేయడానికి కేసీఆర్ ఈ వీడియోలు, ఆడియోలను ఉపయోగించుకున్నారు.

న్యాయస్థానాల్లో...
అయితే ఇవి ఎంతవరకూ న్యాయస్థానాల్లో నిలబడతాయన్నది సందేహమే. కేవలం చర్చ జరగడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని తప్పించి న్యాయ పరంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావన్నది న్యాయ నిపుణులు సూచిస్తున్న మాట. ఎవరో ముగ్గురు కూర్చుని ప్రధాన నేతల పేర్లు చెబితే అది నిజమవుతుందా? వారికి తమతో ఉన్న సంబంధాలను రుజువు చేయగలరా? అని బీజేపీ ప్రశ్నిస్తే సమాధానం ఏం దొరుకుతుందన్నది కొందరి వాదన. ఈ వీడియోలు పిచ్చాపాటీగా మాట్లాడుకున్న కొందరి వ్యవహారమని ఎందుకు కొట్టిపారేయకూడదన్న సందేహాన్ని కూడా కొందరు లేవనెత్తుతున్నారు.

 విలువ ఎంత?
రామచంద్రభారతి, సింహయాజి, నందూలు వచ్చి వందల కోట్లు ఇస్తామని, బీజేపీలో చేరాలని చెబితే అది ఆధారం కింద న్యాయస్థానాలు పరిగణిస్తాయా? అంటే లేదనే అంటున్నారు. బీజేపీ మాత్రం ఈ ముగ్గురితో తమకు ఏం సంబంధం అని నిలదీస్తుంది. వారు మాట్లాడిన మాటలకు విలువ ఉంటుందా? వారెవరో వచ్చి నాలుగు ప్రభుత్వాలను కూల్చి వేస్తామని, గతంలో కొన్ని ప్రభుత్వాలను కూల్చేశామని చెబితే న్యాయస్థానాలు నమ్ముతాయా? అంటే లేదనే వారి సంఖ్యే అధికంగా ఉంది. కర్ణాటకలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా కానీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రమేనన్న విషయాన్ని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఏదో జరిగిపోతుందని....
కేసీఆర్ కూడా న్యాయపరంగా ఏదో జరిగిపోతుందని ఈ వీడియోలను బయటపెట్టలేదంటున్నారు. కేవలం ప్రజల్లో బీజేపీకి అందులో మోదీకి ఉన్న క్రేజ్ ను తగ్గించడానికే కేసీఆర్ ఈ వ్యూహాన్ని రచించారంటున్నారు. నిన్న కేసీఆర్ చూపించిన వీడియోలు వినడానికి బాగున్నా అందులో వాస్తవం ఎంత? నలుగురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని పడగొట్ట గలరా? తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ లను కూడా పడగొడతామని చెప్పడంలో నిజమెంత? ఎందుకంటే ఢిల్లీని మినహాయించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఏడాది, ఏడాదిన్నర మాత్రమే ఉన్నాయి. ఇంత స్వల్ప కాలం కోసం ఎవరైనా కోట్లాది రూపాయలు వెచ్చిస్తారా? అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ గోకుతూనే ఉంటారు. గోల చేస్తూనే ఉంటారు. న్యాయ పరంగా పక్కన పెడితే ఈ కొనుగోలు వ్యవహారం నుంచి బీజేపీ మాత్రం ప్రజల నుంచి ఎలా బయటపడుతుందన్నది చూడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తానని ప్రకటించారు. దాంతోనే బీజేపీ కొంత డ్యామేజీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.


Tags:    

Similar News