న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్

వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందుగా అప్రమత్తం కాకపోవడం వల్లనే ఇంతటి విపత్తు సంభవించిందనిచంద్రబాబు అన్నారు.

Update: 2021-11-25 05:18 GMT

వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందుగా అప్రమత్తం కాకపోవడం వల్లనే ఇంతటి విపత్తు సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రకృతి వైఫల్యాలను ఎదుర్కొనడంలోనే ప్రభుత్వ సమర్థత తెలుస్తుందన్నారు. చంద్రబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. కడప, చిత్తూరు జిల్లాల్లోవ ప్రాజెక్టులు, చెరువులు తెగిపోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేకపోయిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఏం చేస్తుందని, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో విఫలమయిందని చంద్రబాబు ఆరోపించారు.

నాసిరకం పనుల వల్లనే...
అన్నమయ్య ప్రాజెక్టులో నాసిరకం పనులు చేశారన్నారు. దానిని నిరర్థక ఆస్తిగా తయారు చేశారన్నారు. కనీసం గేట్లు కూడా అమర్చలేకపోయిందన్నారు. నదిలో ఇసుక ట్రిప్పర్లు, ప్రొక్లెయినర్లను కాపాడటానికి గేట్లు ఎత్తలేదని చంద్రబాబు ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్లు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వ అహంకారం ప్రజలకు శాపంగా మారిందన్నారు. రాయలచెరువు విషయంలోనూ ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందన్నారు. ప్రకృతితో ఈ ప్రభుత్వం ఆడుకుందన్నారు. తుమ్మలకుంట చెరువు ఆక్రమణకు గురవ్వడంతోనే తిరుపతి పట్టణం మునిగిపోయిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన లేదన్నారు. తాను వస్తున్నానని అధికార పార్టీ హడావిడి చేసిందన్నారు.
పొగిడించుకుంటూ...
వరదలు ముంచెత్తుతున్నా అసెంబ్లీలో ముఖ్యమంత్రి తనను తాను పొగిడించుకుంటున్నారన్నారు. ఇది పైశాచికానందమని చంద్రబాబు అన్నారు. మానవ తప్పిదం పై న్యాయ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంతటి నష్టానికి ఎవరు కారణమన్నది తేలాలని, వాస్తవాలను బయటకు రావాలని, కారకులైన వారిని శిక్షించాలని చంద్రబాబు కోరారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజలే పాతాళంలోకి తొక్కుతారని ఆయన హెచ్చరించారు. విశాఖలో హుద్ హుద్ తుపాను వస్తే వారం రోజుల్లోనే తాము సాధారణ స్థితికి తీసుకు వచ్చామన్నారు. సాయం చేయడంలోనూ, పునరావాసం ఏర్పాటు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమయిందన్నారు. ప్రతి పంటకు పరిహారం పెంచాలన్నారు. వరద నీరు ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ ముఖ్యమంత్రి రంగులు వేయడానికి నాలుగు వేల కోట్లు, మరలా తొలగించడానికి రెండు వేల కోట్లను ఖర్చు చేశారన్నారు. అనవసర ఖర్చును పక్కన పెట్టి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి తండ్రి చనిపోతే ఏదో కారణాలతో గుండె ఆగి చనిపోయిన వారిని నాలుగేళ్లు ఓదార్చిన జగన్ ఇప్పుడు వరద బాధితులను పరామర్శించకపోవడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.


Tags:    

Similar News