కుమారస్వామి తప్ప మరెవరూ రారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీకి కుమారస్వామి తప్ప మరెవరూ మద్దతు తెలపలేదు
నిజమే.. రాజకీయాలను పరిశీలిస్తే.. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఎవరు మద్దతిస్తారు? జాతీయ పార్టీలోకి ఏ పార్టీ అయినా వచ్చే అవకాశం ఉందా? దక్షిణ భారత దేశానికి చెందిన ఒక నేత జాతీయ పార్టీ పెడితే ఉత్తరాదిలోని ప్రాంతీయ పార్టీలు సమర్థిస్తాయా? సానుకూలంగా స్పందిస్తాయా? అంటే లేదనే జవాబు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీకి సొంత అజెండాలున్నాయి. వాటికంటూ వారి రాష్ట్ర ప్రయోజనాలున్నాయి. రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో కలిసేందుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతారు తప్పించి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారితే దానికి అంగీకరించేంత గొప్ప మనసు ఎవరికీ ఉండక పోవచ్చు.
బీహార్ లో రెండు పార్టీలు...
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మహారాష్ట్ర కు వెళ్లి శరద్ పవార్ ని కలసి వచ్చారు. వీరిలో అఖిలేష్ తప్ప మిగిలిన వారంతా ఆ యా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారే. నితీష్ కుమార్ ప్రస్తుతం ఆర్జేడీతో పొత్తుతో ఉన్నారు. అంటే ఆయన కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వి యాదవ్ చేసిన కీలక వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లేని ఫ్రంట్ బీజేపీని ఎదుర్కొనలేదన్నారు. విపక్ష పార్టీలన్నీ కలసి పోటీ చేయాలని ఆయన సూచించారు. థర్డ్ ఫ్రంట్ కాకుండా మెయిన్ ఫ్రంట్ గానే ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలతో వారు కేసీఆర్ తో కలసి వచ్చే అవకాశం లేదు.
కేజ్రీవాల్ రూటు...
ఇక అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో గెలిచిన తర్వాత ప్రధాని పదవి పై హోప్స్ పెట్టుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్న లక్ష్యంతో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కేజ్రీవాల్ వ్యతిరేకమైనా తాను మాత్రమే బీజేపీకి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. ఇక మమత బెనర్జీ సంగతి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమె తొలి నుంచి తానే బీజేపీకి ఆల్టర్నేటివ్ అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటూనే ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో తనదే పై చేయి అని చూపించుకోవాలని తహతహలాడారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చే ప్రయత్నం చేయరు. ఆయన మహారాష్ట్ర రాజకీయాలకే పరిమితమైనప్పటికీ జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు.
కుమారస్వామి మాత్రం....
ఉత్తరాది వరకూ ఎందుకు దక్షిణాదిలోనూ కేసీఆర్ కొత్త పార్టీ వైపు ఎవరూ మొగ్గు చూపకపోవచ్చు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేసీఆర్ పార్టీకి మద్దతు పలికే పరిస్థితి లేదు. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ పక్కాగా కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. కాంగ్రెస్ ను విడిచి ఆయన రారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వతంత్రంగా ఉంటారు తప్ప జాతీయ రాజకీయాలను ఆయన పట్టించుకోరు. ఇక ఒకే ఒక్కటి కర్ణాటకలో జేడీఎస్ మాత్రమే కేసీఆర్ తో జతకట్టే అవకాశముంది. కర్ణాటక, తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఒక్కటే. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలతో కలసి జేడీఎస్ పోటీ చేయదు. ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎవరు అధికారం ఇస్తామన్నా ఒప్పుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతనే పొత్తులను కుదుర్చుకుంటుంది. అందుకే కుమారస్వామి పార్టీ తప్ప కేసీఆర్ జాతీయ పార్టీకి నేరుగా మద్దతు తెలిపేందుకు అటు ఉత్తారాదిన, ఇటు దక్షిణాదిన ఏ పార్టీ ముందుకు వచ్చే అవకాశాలయిలే ఉండకపోవచ్చు.