మాగంటి ప్లేస్‌లో కొత్తనేత ఎవరంటే?

ఈసారి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్‌ను మాగంటి బాబుకు చంద్రబాబు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు.;

Update: 2023-04-11 06:19 GMT

ఈసారి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్‌ను మాగంటి బాబుకు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. చంద్రబాబు పార్లమెంటు సీట్ల విషయంలో కొన్ని ప్రత్యేకతలను పాటిస్తారు. రిజర్వడ్ స్థానాలతో పాటు జనరల్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలమైన నేతలకే సీట్లు కేటాయిస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. పార్టీపై నిధుల భారం పడకుండా ఆ జాగ్రత్తలయితే ఎక్కువ చోట్ల తీసుకుంటారు. వీలుకాని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో సామాజికవర్గంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతారు. అది చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అలవాటు. ఈసారి కూడా చంద్రబాబు పార్టీ టీడీపీ నిధుల లేమితో కొంత ఇబ్బంది పడుతుంది.

మాగంటి కుటుంబానికి...
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప పెద్ద స్థాయిలో నిధులు సమకూర్చుకునే అవకాశాలు కూడా లేవు. అందుకే బీజేపీతో సయోధ్యతో చంద్రబాబు 2019 ఎన్నికల నాటి నుంచి వ్యవహరిస్తున్నారు. ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చే సరికి మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు ఈసారి చంద్రబాబు పక్కన పెడతారంటున్నారు. మాగంటి కుటుంబానికి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తండి దగ్గర నుంచి ఆయన వరకూ రాజకీయాల్లో కొనసాగారు. 1998 ఎన్నికల్లో ఏలూరు ఏంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి బాబు 2009లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో అదే స్థానం నుంచి గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు. అయితే మాగంటి కుటుంబంలో వరస విషాదాలు చోటు చేసుకోవడంతో కొంత పార్టీ కార్యక్రమాలకు దూరమైనా ఇటీవల యాక్టివ్ అయ్యారు.
ఇన్‌ఛార్జుల అభ్యంతరం...
అయితే ఎక్కువ మంది శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు మాగంటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మాగంటి బాబుకు అన్ని నియోజకవర్గాల్లో పరిచయాలుండటం, అధినేతతో నేరుగా పరిచయాలు ఉండటంతో తమకు నిధుల విషయంలో అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఏదో నామమాత్రంగా నిధులు ఇచ్చి తమను వదిలేస్తారని భావించి అధినాయకత్వంపై మాగంటి బాబుకు ఈసారి ఏలూరు పార్లమెంటు టిక్కెట్ ఇవ్వవద్దంటూ చంద్రబాబు వద్ద మొరపెట్టుకుంటున్నారని తెలిసింది. కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరుతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు కూడా మాగంటి బాబు అభ్యర్థిత్వం విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నట్లు తెలియవచ్చింది. మాగంటి బాబు బలహీన మైన అభ్యర్థి అని సర్వేల్లో రావడం, ఎక్కువ మంది శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు వ్యతిరేకిస్తుండటంతో కొంత ఆలోచనలో పడ్డారంటున్నారు.
కొత్తనేతగా...
కొత్త నేత కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. మాగంటి కుటుంబం నుంచే కొత్త నేతను ఎంపిక చేసినట్లు చర్చ జరుగుతుంది. మాగంటి బావమరిది కొమ్మారెడ్డి రాంబాబుకు టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖలో స్థిరపడిన రాంబాబు ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొమ్మారెడ్డి రాంబాబు అయితే తమకు అభ్యంతరం లేదని నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కూడా చెబుతున్నారట. పారిశ్రామికవేత్త కావడంతో తాము ఆశించిన నిధులను ఆయన నుంచి రాబట్టవచ్చని భావిస్తున్నారు.
బావాబామ్మర్దులు కావడంతో...
209 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి నిధులు అత్యధికంగా ఇచ్చిన వారిలో కొమ్మారెడ్డి రాంబాబు ఒకరు. అయితే ఆయన తర్వాత ఎలాంటి ప్రతిఫలం పొందకపోవడంతో ఏలూరు టిక్కెట్ ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. మాగంటి బాబును పక్కన పెట్టి ఆయనకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది. కానీ ఇద్దరూ సొంత బావబామ్మర్దులే కావడంతో మాగంటి బాబు సీటు తనకే గట్టిగా సీటు కావాలని పట్టుపడితే మాత్రం కొమ్మారెడ్డి రాంబాబు పోటీ చేయనని కూడా చెప్పే అవకాశాలు లేకపోలేదు. అయితే మాగంటి కుటుంబంపై సానుభూతి ఉండటంతో చంద్రబాబు చివరి నిమిషంలో మనసు మార్చుకుంటారా? లేక ఆర్థికంగా బలమైన నేత కొమ్మారెడ్డి రాంబాబును ఎంపిక చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News