ఓటింగ్‌ శాతం కీలకం..?

గురువారం పదేళ్ల తెలంగాణకు అత్యంత కీలకమైన రోజు మూడు కోట్ల మంది ఓటర్లు ఐదేళ్ల తమ భవితకు దిశా నిర్దేశం చేసుకునే రోజు. కొండంత ఆత్మ విశ్వాసంతో కాంగ్రెస్‌, కాస్త కలవరపాటుతో కేసీయార్‌ పార్టీ, గేమ్‌ చేంజర్‌ అవుదామన్న వ్యూహంతో భాజపా, కింగ్‌ మేకర్‌ కావచ్చన్న ఆశతో ఎం.ఐ.ఎం... ఇదీ ప్రస్తుత కీలక పార్టీల మనోభావాలు. భాజపాకు మద్దతు ఇస్తూ తాను కూడా ఉన్నానంటోంది జనసేన.

Update: 2023-11-29 15:52 GMT

గురువారం. పదేళ్ల తెలంగాణకు అత్యంత కీలకమైన రోజు. మూడు కోట్ల మంది ఓటర్లు ఐదేళ్ల తమ భవితకు దిశా నిర్దేశం చేసుకునే రోజు. కొండంత ఆత్మ విశ్వాసంతో కాంగ్రెస్‌, కాస్త కలవరపాటుతో కేసీయార్‌ పార్టీ, గేమ్‌ చేంజర్‌ అవుదామన్న వ్యూహంతో భాజపా, కింగ్‌ మేకర్‌ కావచ్చన్న ఆశతో ఎం.ఐ.ఎం... ఇదీ ప్రస్తుత కీలక పార్టీల మనోభావాలు. భాజపాకు మద్దతు ఇస్తూ తాను కూడా ఉన్నానంటోంది జనసేన. కాంగ్రెస్‌కు పరోక్షంగా సపోర్ట్‌ చేస్తూ తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో తాను కూడా ప్రభావం చూపించాలనుకుంటోంది.

ఓటర్లను ఆకట్టుకునే హామీలు, హోరెత్తించే ప్రచారం, తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం, నగదు... పట్టుబడకుండా, ఓటర్లకు చేరుతున్న వందల కోట్ల డబ్బు... ఇవీ నేటి ఎన్నికల ఏర్పాట్లు. పార్టీల ఆశలు, విశ్లేషకుల వివరణలు, మీడియా అంచనాలు ఎలా ఉన్నా... తాను చెప్పబోయే తీర్పుపై ఇప్పటికే తెలంగాణ ఓటరు ఓ నిర్ణయానికి వచ్చేశాడు. రేపటి ఓటింగ్‌ శాతం మాత్రం ఫలితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంటే అధికార పార్టీకి డేంజర్‌ బెల్స్‌ మోగినట్లేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిమీద సాధికారికమైన డేటా లేదు. ఉదాహరణకు 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 73.2 శాతం ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి 88 స్థానాలు గెలుచుకుని రెండోసారి విజయకేతనం ఎగరవేసింది. 2019 ఆంధ్ర ఎన్నికల్లో 79 శాతానికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు నాటి తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓట్లతో 85 శాతం సీట్లతో వైకాపా విజయ ఢంకా మోగించింది. మొన్న జరిగిన రాజస్థాన్‌ ఎన్నికల్లో 75.5 శాతం పోలింగ్‌ నమోదైంది. అక్కడ భాజపా గెలుస్తుందని సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

ఓటర్లు పోటెత్తితే అది ప్రభుత్వ వ్యతిరేకతే అని సర్వేకారులు చెబుతున్నారు. భారాస నాయకుడు కేటీయార్‌ మాత్రం ఈ మాటలతో ఏకీభవించడం లేదు, ’ఎక్కువ శాతం పోలింగ్‌ జరగబోతోంది. నిశ్శబ్ద ఓటుతో మేము మళ్లీ అధికారంలోకి వస్తామ’ని ఆయన ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. రేపు సాయంత్రానికి ఎగ్జిట్‌ పోల్స్‌తో తెలంగాణ ‘గెలుపు’పై ఓ స్పష్టత వస్తుంది. డిసెంబర్‌ మూడు నాటికి నైజాం నవాబ్‌ ఎవరో తేలిపోతుంది.

Tags:    

Similar News