కమల వికాసమా..! హస్త విలాసమా..! ఢిల్లీ పీఠం ఎవరిది?
2024.. మన దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన సంవత్సరం. రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని స్థాపించి, ముచ్చటగా మూడోసారి..;
2024.. మన దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన సంవత్సరం. రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని స్థాపించి, ముచ్చటగా మూడోసారి సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న కమలం పార్టీ ఒకవైపు.. పదేళ్లుగా పరాభవాలతో కుమిలిపోతూ, ఈ సారి ఎలాగైనా కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని తపిస్తున్న వందేళ్ల కాంగ్రెస్ మరోవైపు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైరి శిబిరాలు సైన్యాన్ని మోహరించాయి. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి స్థాయిలో అధికారం చేపడతామని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు.
భాజపాలో సన్నగిల్లిన ధైర్యం
ఎన్‌డీఏ కూటమిలో అతి పెద్ద పార్టీ అయినా, 2014, 2019లలో స్వయంగా పూర్తిస్థాయి మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం సాధించిన పార్టీ భాజపా. ఈ సారి కమలం గెలుపు నల్లేరు మీద నడక కాదని ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఓడిపోవడం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ. మోదీ స్వయంగా దాదాపు 20 ర్యాలీలు, 6 రోడ్ షోలలో పాల్గొన్నారు. అయినా ఆ పార్టీ ఓటమి మూటగట్టుకుంది. ఈ ఓటమితో కళ్లు నేలమీదకు వచ్చిన భాజపా అధిష్టానం, అందివచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటోంది. ఇక ఎన్డీయే 1 హయాంలో భాజపాతో ఉన్న శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ లాంటి పార్టీలు పెద్దన్నకు కటీఫ్ చెప్పాయి. ఈ ఏడాది హిందీ హార్ట్‌ల్యాండ్‌తో పాటు తెలంగాణతో కలిపి 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుంది. రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కానీ అధికారంలోకి వస్తే బీజేపీ లోక్‌సభ సీట్లకు భారీగా గండి పడుతుంది. మోదీ ఛరిష్మా ఇంకా ఎంతకాలం పని చేస్తుందో చెప్పలేం. పదేళ్లు అయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం సహజం. హిందుత్వవాదం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, అవినీతి రహిత పాలన ఇలాంటివన్నీ బీజేపీకి కేంద్రంలో అధికారాన్ని సాధించిపెట్టకపోవచ్చు.. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు గెలవచ్చు. కానీ ఆ పెద్ద రాష్ట్రంలో గెలుపే కేంద్రంలో అధికారాన్ని సాధించి పెట్టదు.
జోడో యాత్ర ఫలితమిచ్చేనా ?
పరాభవాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌కు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొత్త ఊపిరిలూదింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగిన సాగిన పాదయాత్ర కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్రయోజనం కలిగించిందో తెలీదు కానీ రాహుల్‌ని మాత్రం నాయకుడిగా అందరూ అంగీకరించేలా చేసింది. కర్నాటక ఫలితాలు బూస్టర్ డోస్‌లా పని చేశాయి . ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే రాహుల్‌ను తమ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో ఎవరికి వారే యమునాతీరే అంటూ సాగిన ప్రతిపక్షాలు ఈ సారి ఒక్కతాటిపైకి వచ్చి, పోటీ చేస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఇప్పటికీ భాజపాదే డామినేషన్
దేశంలో పది రాష్ట్రాల్లో భాజపా, ఐదు రాష్ట్రాల్లో భాజపా సంకీర్ణ పక్షాలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాలో, వాటి మిత్ర పక్షాలు 3 రాష్ట్రాల్లో అధికారాన్ని చలాయిస్తున్నాయి. ఎనిమిది రాష్ట్రాల్లో రెండు పార్టీలకు సమాన దూరం పాటించే పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అంటే దాదాపు సగం రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందన్నమాట. అలాగే సిద్ధాంతబలం, సంఫ్‌ు సేవకుల మద్దతు ఆ పార్టీకి అదనపు బలాలు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టి మరోసారి హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో చాలాపార్టీలు, మీడియా భాజపా పని అయిపోయిందని భావించాయి. ఆ భ్రమలోనే చంద్రబాబులాంటి వాళ్లు ఆ పార్టీకి దూరమయ్యారు. కర్నాటకలో దెబ్బతగిలిన తర్వాత బీజేపీ అన్ని పక్షాలనూ దువ్వుతోంది. అందుకే చంద్రబాబుతో నడ్డా, షా భేటీ అయ్యారు.
ఇటు ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయిస్తూ జగన్‌ను కూడా లైన్‌లో ఉంచుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో అధికారాన్ని వదులుకోకూడదన్నది భాజపా దృఢ నిశ్చయం. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంత బాగాలేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వచ్చినా కేంద్రంలో అధికారంచేపడతామన్న ఆశ ఆ పార్టీకి లేదు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ చేపట్టిన ఏ కార్యక్రమమూ లేదు. లోక్‌సభ సభ్యత్వం రద్దు అవకాశాన్ని ఆయన పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా పూర్తి స్థాయిలో పనిచేయనున్నానరు. ఆమె ప్రభావం ఎంతో చూడాలి. ప్రతిపక్షాల ఐక్యత నేతి బీరలో నేతిలా ఉంది. చాలా ఏళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాలను చూసిన ఓటరు మళ్లీ స్థిరమైన ప్రభుత్వం కావాలనుకుంటాడో, లేదా కాంగ్రెస్ కూటమికి అవకాశం ఇస్తాడో వేచి చూడాల్సిందే!