Bhatti Vikramarka : భట్టి మరో రోశయ్యలా మారారా?.. ఇద్దరూ ఒక్కటవ్వడంతో?

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉండే నేత;

Update: 2025-03-17 12:18 GMT
mallu bhatti vikramarka,  deputy chief minister, revanth reddy, ts politics
  • whatsapp icon

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉండే నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న భట్టి విక్రమార్క ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా రాజకీయపరంగా పెద్దదే. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతా తానే అయి వ్యవహరిస్తున్నారన్నది ఇఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ సరైన సమయంలో ఆయనకు మద్దతుగా నిలుస్తూ మల్లు భట్టి విక్రమార్క సీఎంకు కుడి చేయిగా మారారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆర్థిక మంత్రి రోశయ్య ఎలా వ్యవహరించే వారో, నేడు భట్టివిక్రమార్క కూడా రేవంత్ కు అదే మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నారని చెబుతున్నారు.

కెమిస్ట్రీ కుదరడంతో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లు భట్టి విక్రమార్కకు మంచి ప్రాధాన్యత ఇస్తూ తొలి నుంచి వస్తున్నారు. ప్రజాభవన్ లో ఆయన నివాసానికి ముఖ్యమంత్రి అంగీకరించింది మొదలు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మల్లు భట్టి విక్రమార్క వెంట ఉండాల్సిందే. పార్టీ నియామకాల్లోనూ, ప్రభుత్వ పోస్టుల భర్తీ విషయంలో ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఇద్దరిదీ ఒకటే మాట కావడంతో హైకమాండ్ వద్ద కూడా ఇక మరో మాట మాట్లేడుందుకు వీలు లేకుండా పోయే వాతావరణాన్ని కల్పించారు. సాధారణంగా అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య భారీ గ్యాప్ ఉంటుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మధ్య విభేదాలున్నాయి.
ఢిల్లీకి వెళ్లినా...
ముఖ్యమంత్రి తన సీటును పదిలం చేసుకోవడానికి ఢిల్లీ ప్రయాణం కడితే, ఉప ముఖ్యమంత్రి సీఎంపై ఫిర్యాదులు చేసేందుకు హస్తినకు పయనమవుతారు. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. సామాజికవర్గం పరంగా బలమైన నాయకుడైన మల్లు భట్టి విక్రమార్క హస్తినలో పెద్దల వద్ద కూడా రేవంత్ అభిప్రాయాలనే తాను కూడా చెబుతుండటంతో ఇక వన్ వే గా మారింది. దీంతో రేవంత్ రెడ్డి కూడా కొంత బిందాస్ గా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిగా కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను ఆర్థిక మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క విడుదల చేస్తూ సహకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లి ఇచ్చే హామీలకు కూడా నిధులను విడుదల చేస్తూ భట్టి భళా అనిపించుకుంటున్నారు.
మల్లుతోనే మల్లయుద్ధం చేయించాలన్న...
ఇద్దరు ఒకటి కావడంతో మిగిలిన మంత్రులు కూడా ఇక ఏమీ చేయలేని పరిస్థితి. మంత్రులకు కూడా రేవంత్ కు విధిలేని పరిస్థితుల్లో సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మల్లు భట్టి విక్రమార్క తన విమర్శలతో విపక్షానికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా మల్లు భట్టి విక్రమార్క లేకుండా బయటకు కాలు కదపరు. ఆయన లేకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించరు. మల్లుతోనే మల్లయుద్ధం చేయించాలన్న రేవంత్ రెడ్డి ప్లాన్ రాజకీయంగా సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. బలమైన బీఆర్ఎస్ ను ఢీకొనడానికి రేవంత్ కు మల్లు భట్టి విక్రమార్క సహకరిస్తుండటంతో ఇద్దరిదీ మంచి జోడీ అయిందన్న టాక్ బలంగా వినిపిస్తుంది.


Tags:    

Similar News