నాలుగున్నరేళ్లు చంద్రబాబు - మోదీ చేసిన సంసారాన్ని చూసి చిలుకాగోరింకలు కూడా సిగ్గుపడ్డాయని, ఇప్పుడు తన వైఫల్యాల నుంచి ప్రజలు దృష్టి మళ్లించడానికి బీజేపీతో విడిపోయారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....
- చంద్రబాబు రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి ప్రధానిని దింపేస్తానని దేశం తిరుగుతున్నారు.
- నాలుగున్నరేళ్లు బీజేపీతో కాపురం చేసినన్ని రోజులు... నరేంద్ర మోదీ వంటి నాయకుడు ప్రపంచంలోనే లేడని అసెంబ్లీలో చంద్రబాబు తీర్మాణం చేశారు.
- బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినంతలా ఏ రాష్ట్రానికి చేయలేదని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
- ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు రావడంతో రాష్ట్రానికి ఏమీ చేయనందున, నేరాన్ని ఎవరిపైనైనా నెట్టేందుకు బీజేపీతో విడిపోయారు.
- రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీని అప్పుడు అవినీతి ఆనకొండ అన్న చంద్రబాబు ఇప్పుడు ఆనందాల కొండ అంటున్నారు.
- అప్పుడు రాహుల్ గాంధీని మొద్దబ్బాయి అన్న చంద్రబాబు ఇప్పుడు మేధావి అంటున్నారు.
- చంద్రబాబు పాలనను విమర్శిస్తూ నాలుగు నెలల కింద కాంగ్రెస్ పార్టీ బుక్ విడుదల చేసింది. చంద్రబాబు వంటి అవినీతిపరుడు ఎవరూ లేరని, ఆయనది దుష్టపాలన అని ఆరోపించి ఇవాళ తెలంగాణలో ఒకే స్టేజిపైన మాట్లాడుతున్నారంటే వీరికి సిగ్గుందా ?
- ఆగస్టు 29న హరికృష్ణ చనిపోయినప్పుడు వెళ్లిన చంద్రబాబు కలిసి పనిచేద్దామని మృతదేహం ఉన్నప్పుడే కేటీఆర్ ని అడిగితే కుదరదని కేటీఆర్ చెప్పారట.
- దీంతో పోయి రెండు నెలలకే అక్టోబరులో వెళ్లి కాంగ్రెస్ తో కలిశారు. ఏపీలో చేసిన అవినీతి సొమ్ములో తెలంగాణ కాంగ్రెస్ కు డబ్బులు ఇస్తానంటే చంద్రబాబుతో కాంగ్రెస్ సిగ్గులేకుండా పొత్తు పెట్టుకుంది.
- ఒకవేళ ఆగస్టు 29న కేటీఆర్ ఒప్పుకొని ఉంటే కేసీఆర్ పక్కన ఇవాళ నిలబడి కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసేవారు కాదా ? ఇటువంటి అనైతిక రాజకీయాలను చక్రం తిప్పడం అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.