ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నారు : కోదండరామ్

Update: 2017-02-02 12:20 GMT

తెలంగాణ ప్రభుత్వం జేఏసీని అణిచివేయాలని చూస్తోందని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. పోలీసులు జేఏసీ సభ్యులను నిత్యం వేధిస్తూనే ఉన్నారని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాము చేసిన ఉద్యమంలో పోలీసుల నుంచి ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నామని, కాని రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేసే పొరపాట్లను ప్రశ్నించకూడదా? ప్రజాకాంక్షలకు విరుద్ధంగా చేపట్టే నిర్ణయాలను వ్యతిరేకించకూడదా? సమాజంలో ఎవరైనా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉందన్నారు కోదండరామ్. అలాగే సంఘాలను కూడా ఎవరైనా పెట్టుకోవచ్చన్నారు. సంఘాలు పెట్టుకోవడానికి పోలీసుల అనుమతి అవసరం లేదన్న కోదండరామ్ ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గుర్తించాలని కోరారు.

ఉద్యోగాల కోసం ఆందోళన...

తెలంగాణ రాష్ట్రం వచ్చినా...ఉద్యోగాలు రాక వేలాది మంది యువతీయువకులు నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. కోచింగ్ లు తీసుకుని ఉద్యోగాలు రాక, ఇటు ఇళ్లకు వెళ్లలేక మధనపడిపోతున్నారని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ఓపికపట్టామని, ఇక ఓపిక పడితే ఉద్యోగాలకు వారి వయసు కూడా అయిపోతుందన్నారు. అందుకే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 22వ తేదీన నిరుద్యోగుల సమస్యలపై నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు కోదండరామ్ చెప్పారు. ప్రభుత్వంతో ఈ సమస్య పై చర్చించేందుకు జేఏసీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు.

Similar News