ఎమ్మెల్యేలతో కేసీఆర్ మాటామంతీ

Update: 2017-01-27 10:36 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాటామంతీ చేస్తున్నారు. వారితో ఉల్లాసంగా గడుపుతున్నారు. వారి యోగక్షేమాలతో పాటుగా నియోజకవర్గ సమస్యలుపై ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమాశమయ్యారు. ఆయన వారిని పేరుపేరునా అడిగి పరిచయం చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం ఇంకా పోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దళితుల్లో పేదరికాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎస్సీఎస్టీ జీవన విధానంలో ఇంకా మార్పు తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక నిధులను వాటికే వెచ్చించాలని, వచ్చే బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సమగ్ర బడ్జెట్ ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలను కేసీఆర్ కోరారు. తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.

Similar News