కేసీఆర్ పై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు

Update: 2017-01-31 04:48 GMT

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, గృహనిర్మాణం, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు వంటి విషయాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు నిశ్చయించుకుంది. ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో హస్తినకు టీటీడీపీ నేతల బృందం బయలుదేర నుంది. టీటీడీపీ నేతలు. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి నెల రెండో వారం నుంచి టీడీపీ తెలంగాణలోని మంత్రుల నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ టీడీపీ సమావేశంలో నేతలు నిర్ణయించారు.

మంత్రుల నియోజకవర్గాల్లో సభలు....

కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై పోరాటం చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కేసీఆర్ అమలు పర్చడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజాసమస్యలను పక్కన బెట్టి కేసీఆర్ సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారంటున్నారు టీటీడీపీ నేతలు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని వారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దాదాపు 9వేల కోట్లు ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటున్నారు. జోనల్ వ్యవస్థ రద్దుపై కూడా హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటుగా మంత్రుల నియోజకవర్గాల్లోనే భారీ బహిరంగ సభలను పెట్టనున్నారు. ఫిబ్రవరి 11న కొల్లాపూర్, 15న గజ్వేల్, 20 న నిర్మల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తమకు మిత్రపక్షంగా ఉన్నబీజేపీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు టీటీడీపీ నేతలు. కేంద్రానికి ఫిర్యాదు చేసి కేసీఆర్ కు చెక్ పెడదామనుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణ తెలుగు తమ్ముళ్ల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Similar News