కోనసీమను షేక్ చేస్తున్నదేంటి?

Update: 2017-01-29 12:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో అన్నపూర్ణగా పేరొందిన కోనసీమలో ఇప్పుడు ఓ విషయం షేక్ చేస్తుంది. షేల్ గ్యాస్ తవ్వకాలకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటంతో కోనసీమవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కోనసీమలో రిలయన్స్ గ్యాస్ కుంపటి రగులుతూనే ఉంది. ఎప్పుడు గ్యాస్ లీకవుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కోనసీమ ప్రజలు. తాజాగా షేల్ గ్యాస్ తవ్వాకాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో కోనసీమ మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఎటువంటి అనుమతి లేకుండానే ప్రభుత్వ సంస్థలు కొన్ని కోనసీమలో షేల్ గ్యాస్ తవ్వకాలను ప్రారంభించాయి. వీటికి పర్యావరణ అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. దీనివల్ల కోనసీమలో పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాతిపొరల్లో నిక్షిప్తమై ఉండే గ్యాస్ ను వెలికి తీయడమే షేల్ గ్యాస్ ఉద్దేశ్యం. షేల్ గ్యాస్ వెలికితీయడం వల్ల కోనసీమ జీవన విధానమే దెబ్బతింటుందంటున్నారు మేధావులు. ఇప్పటికే గోదావరి, కృష్ణా జిల్లాల్లో 70 వేల బావుల వరకూ తవ్వేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసిందని తెలియడంతో స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

మామూలుగా సముద్రగర్భం నుంచి భూభాగంలో పైపొరల నుంచి గ్యాస్ ను వెలికి తీస్తారు. అయితే షేల్ గ్యాస్ మాత్రం భూమి అట్టడుగు పొరల్లోకి వెళ్లి వెలికి తీస్తారు. దాదాపు భూమి ఉపరితలం నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలకు తవ్వకాలు జరుపుతారు. ఈ ప్రాంతంలో అపార షేల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడంతో ప్రభుత్వం ఈ గ్యాస్ ను వెలికితీయాలని నిర్ణయించింది. ఇందుకు ఓఎన్జీసీకి అప్పగించారు. ఓఎన్జీసీ కూడా హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానాన్ని అమలుపరుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి పెనుముప్పు ఉందన్నఆందోళన వ్యక్తమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామంలో షేల్ గ్యాస్ ను వెలికితీయాలని ఓఎన్జీసీ నిర్ణయించింది. దీంతో ఇక్కడ ఆందోళన తీవ్రమవుతోంది. అయితే షేల్ గ్యాస్ నిక్షేపాలను అడ్డుకుని తీరతామని గ్రామస్థులు చెబుతున్నారు.

షేల్ గ్యాస్ ను వెలికితీయడం వల్ల మిథేన్ వాయువు గాలిలో కలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వందరెట్ల మేరకు భూతాపం పెరుగుతందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాతిపొరల్లో దాగి ఉన్న రాడాన్ వాయువు కూడా వాతావరణంలో కలవడం వల్ల జన్యలోపాలు తలెత్తుతాయని, పచ్చని పంటలు, చేపల చెరువులు నాశనమై పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షేల్ గ్యాస్ వెలికితీతను అమెరికా, స్పెయిన్, జెర్మనీ దేశాలు నిషేధించాయి. పర్యావరణానికి ముప్పు ఉండటంతోనే ఆ దేశాలు నిర్ణయం తీసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాని ప్రభుత్వం మాత్రం షేల్ గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామస్థులు దీనిపై మండిపడుతున్నారు.

Similar News