ట్రంప్ ‘స్వదేశీ’ నినాదం ఉభయులకూ ప్రమాదం

Update: 2016-12-11 23:25 GMT

భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా చెబుతూ వస్తున్న ‘స్వదేశీ’ నినాదాన్ని ఈదేశం, ఇక్కడి ప్రజలు ప్రభుత్వాలు ఏమేరకు అర్థం చేసుకున్నాయో తెలియదు గానీ.. ప్రస్తుతం అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నిక అయిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం అచ్చంగా దానిని అమల్లో పెట్టబోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే స్వదేశీ నినాదాన్ని ట్రంప్ ఇంకాస్త ఇంప్రొవైజ్ చేస్తున్నారు కూడా. ఆ రకంగా తాను అమెరికా అధ్యక్షుడు కావడానికి, ఒక వర్గం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకోవాలని తపన పడుతున్నారు.

విదేశాల్లో అవుట్ సోర్సింగ్ ఉన్న సంస్థలకు పన్నుల వాయింపు తప్పదని ట్రంప్ ఇప్పటికే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ‘మేకిన్ అమెరికా, వర్క్ ఇన్ అమెరికా’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అమెరికన్లను కిందిస్థాయి ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది.

అయితే ట్రంప్ జనాన్ని ఆకట్టు కోవడానికి మేకిన్ అమెరికా, వర్క్ ఇన్ అమెరికా అంటూ పొయెటిగ్గా చెబుతూ ఉండవచ్చు గానీ.. నిజానికి దీనివల్ల ఉభయులూ నష్టపోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. అమెరికా ఉద్యోగాలను నమ్ముకుని విదేశాలనుంచి వస్తున్న ఉద్యోగార్థు కలలు నెరవేరే అవకాశాలు తగ్గుతాయి. అయితే అమెరికాలో చిరుద్యోగాలకు అమెరికన్లను మాత్రమే తీసుకోవాలని ట్రంప్ సర్కారు నిబంధన పెడితే.. అక్కడి కంపెనీలకు అమెరికన్లు పనికి దొరకడం కూడా కష్టమే అవుతుంది. దాంతో ఇరువర్గాలకూ నష్టం తప్పదని పలువురు అనుకుంటున్నారు.

Similar News