Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల సంఖ్య తక్కువే.. రద్దీ తక్కువగా ఎందుకంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో లేరు.

Update: 2024-11-20 03:00 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో లేరు. తక్కువగానే ఉండటంతో శ్రీవారిని సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటూ తన్మయం చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది శైవక్షేత్రాలను దర్శించుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. అదే సమయంలో సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. తిరిగి శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో లడ్డూల తయారీ కూడా తక్కువగానే చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాన్ని అందచేస్తుున్నట్లు అధికారులు వివరించారు. అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద కూడా పెద్దగా రష్ లేదు. అలాగే వసతి గృహాలు కూడా సులువుగానే భక్తులకు లభిస్తున్నాయి. పెద్దగా వేచి ఉండకుండానే వసతి గృహఆలు దొరుకుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒక కంపార్ట్ మెంట్ లోనే...
ప్రధానంగా శబరిమలకు వెళ్లి, వచ్చే భక్తులతో తిరుమలలో ఎక్కువ మంది భక్తులు కనపడుతున్నారు. మండల పూజలకు వెళ్లేవారు, వచ్చే అయ్యప్పలు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభప్రదమని నమ్ముతారు. అందుకే అయ్యప్పలు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,248 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,852 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News