తాగి రోడ్డెక్కారో ....మీరు జైలుకే

Update: 2017-01-29 08:00 GMT

హైదరాబాద్ లో రోడ్డు పైకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. పీకల దాకా తాగి వాహనాలను నడుపుతూ ప్రాణాలు తీసేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటంతో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై కఠిన చట్టాలు తేవాలని హైదరాబాద్ పోలీసు శాఖ నిర్ణయించుకుంది. కేవలం ఫైన్ తో సరిపెడితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు సిటీలో అనేక చోట్ల డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు.

ఎక్కువగా మైనర్లే....

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువగా పట్టుపడుతుంది మైనర్లే అవుతుండటం పోలీసులకు ఏం చేయాలో తెలియటం లేదు. వారికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. మైనర్లతో పాటు శని, ఆదివారాలు సాఫ్ట్ వేర్ కంపెనీలకు సెలవు దినాలు కావడంతో యువకులు ఎక్కువగా ఫ్రైడే రాత్రి పార్టీలు జోరుగా చేసుకుని రోడ్ల మీదకు వస్తున్నారు. ఖరీదైన వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇకపై కేవలం జరిమానా విధించడంతో సరిపెట్టరు. కౌన్సిలింగ్ చేయరు. ఛార్జిషీటు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. న్యాయశాఖ అధికారులతో ఇప్పటికే చర్చించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

కౌన్సిలింగ్ ఇచ్చినా....

హైదరాబాద్ నగరంలో రమ్య ఘటన మరవకముందే అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తరచూ మద్యం తాగి వాహనాలను నడుపుతూ రోడ్డుపైన వెళ్లేవారిని యాక్సిడెంట్ చేస్తున్నారు. ఏమీ తెలియని అమాయకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా వీరిలో మార్పురాలేదంటున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నవారే. 2014లో హైదరాబాద్ లో 7500 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు. వీరిలో 2600 మందికి శిక్షలు పడ్డాయి. న్యాయశాఖ నుంచి అనుమతి రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కఠిన శిక్షలు పడేలా ఛార్జిషీటు వేస్తామని చెబుతున్నారు పోలీసులు.

సో...ఇక తాగి వాహనం నడిపితే మీరు నేరుగా జైలుకెళ్లాల్సిందే. జాగ్రత్త.

Similar News