ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి ఏపీ ప్రజలకు వరాల జల్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రయూనివర్సిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సభావేదిక నుంచి వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు- బీబీ నగర్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేశారు.అలాగే 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట ఆరు లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని మోదీని తొలుత చంద్రబాబు శాలువతో సత్కరించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడారు.తనపై అభిమానం చూపించిన ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందని అన్నారు.సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామికి నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగించారు.
2047 విజన్ కు చేయూత...
ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలను అధిగమించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలుపుతున్నానని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతోనే మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడమే తమ సంకల్పమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు కలిగి ఉన్న రాష్ట్రమని ప్రధాని అన్నారు. 2047 నాటికి రెండున్నవేల ట్రిలియన్ డాలర్లు ఏపీ సాధించే విధంగా నిర్దేశించుకున్న లక్ష్యానికి తాము చేయూతనిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు శంకుస్థాపన, ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీని అభివృద్ధివైపు పయనింప చేస్తాయని మోదీ ఆకాంక్షించారు. కొత్త గా అభివృద్ధి చెందుతున్న సాంకేతికకు ఏపీ ముందుగా నిలవాలని ప్రధాని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ లను దేశంలో రెండు ప్రారంభించుకుంటే, అందులో ఒకటి ఏపీలో మంజూరు చేశామని ప్రధాని మోదీ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు కూడా ఎక్కువగా వస్తాయని తెలిపారు.
ఏపీ ముఖచిత్రమే మారుతుంది...
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కును కూడా నేడు శంకుస్థాపన చేశానని, అయితే దీనివల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుందని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీలో కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్ ఏరియా వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీ సిటీలో మొబైల్ పరిశ్రమల ఏర్పాటు కారణంగా దేశంలోనే అత్యధికంగా తయారయ్యే ప్రాంతంగా ఏపీ ఆవిర్భవించిందని మోదీ అన్నారు. విశాఖ రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పన తో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుందని మోదీ అన్నారు. విశాఖ షిప్పింగ్ యార్డును కూడా విస్తరించబోతున్నామని మోదీ తెలిపారు. ఏపీలో మత్స్యకారులకు అండగానిలుస్తామని, సముద్రంలో చేపల వేట సందర్భంగా భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ అన్నారు.