'అఫ్గన్ కెప్టెన్' ప్రత్యేక ధన్యవాదాలు
ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో శ్రీలంకను ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది.
ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో శ్రీలంకను ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులు మిగిలి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించిన అనంతరం.. భారత అభిమానులకు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ కృతజ్ఞతలు తెలిపాడు.
పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది వరుసగా మూడో విజయం. ప్రస్తుతం ఆ జట్టు సెమీ-ఫైనల్ రేసులో కొనసాగుతోంది.
మ్యాచ్ అనంతరం.. నా దేశానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మాకు మద్దతు ఇచ్చేందుకు స్టేడియానికి వస్తున్న భారతీయ ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని హష్మతుల్లా షాహిదీ తన ఇంటర్వ్యూని ప్రారంభించాడు.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో పెద్ద గుణపాఠం నేర్చుకున్నామని షాహిదీ అన్నాడు. పాకిస్థాన్‌పై 283 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ విజయవంతంగా ఛేదించింది. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించే సత్తా ఉందని ఈ మ్యాచ్ మాకు విశ్వాసం కలిగించిందని షాహిదీ అన్నాడు. శ్రీలంకపై అది పూర్తిగా ఫలించిందన్నాడు.
మా బృందం అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచింది. పాకిస్థాన్‌పై పరుగుల వేట మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మేము ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించగలమని మేము విశ్వసించాము. మేము మంచి బౌలింగ్‌తో ప్రారంభించాము. చాలా ప్రొఫెషనల్‌గా లక్ష్యాన్ని ఛేదించాము. ఈ విజయంతో నేను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు.
షాహిదీ తన కోచింగ్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కోచ్ మాటలు తన మనస్తత్వాన్ని మార్చేశాయని.. మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని షాహిదీ చెప్పాడు. కోచ్ ఎప్పుడూ సానుకూలంగానే ఉండేవాడు. ప్రపంచకప్‌కు ముందు మేం చాలా కష్టపడ్డాం. ఈ సమయంలో కోచ్‌లు, మేనేజ్‌మెంట్ సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారు. మాకు విశ్వాసం ఇస్తున్నారు. పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు కోచ్ చెప్పిన మాటలు నా ఆలోచనా ధోరణిని మార్చేశాయని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా నేను ముందుండి నడిపించాలి. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను మ్యాచ్‌ని పూర్తి చేయగలిగినందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.
హష్మతుల్లా షాహిదీ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌పై కూడా ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ తరపున తన 100వ వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతడు ధనంజయ్ డి సిల్వా వికెట్‌ను తీశాడు.