Virat Kohli : పరుగుల మెషీన్ కు స్పెషల్ బర్త్ డే సెలబ్రేషన్స్
ఇండియన్ క్రికెటర్ విరాట్ కొహ్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఈడెన్ గార్డెన్స్ లో ఏర్పాట్లు చేస్తున్నారు
క్రికెట్ అంటే విరాట్ కొహ్లి.. కొహ్లి మైదానంలో కనపడితే చాలు ఆ జోష్ వేరు. పరుగుల మెషీన్ ను చూడాలని ఎవరికి ఉండదు. కేవలం కొహ్లిని చూడటం కోసమే వ్యయప్రయాసలకోర్చి మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి చేరుకుంటారు ఫ్యాన్స్. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ విరాట్ కొహ్లికి లెక్కకు మించి అభిమానులున్నారు. కొహ్లి క్రీజులో ఉన్నాడంటే చాలు ఆ మజాయే వేరు. కొహ్లికి ఉన్న ఫాలోయింగ్ మరే క్రికెటర్ కూ లేదన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు. కొహ్లిని తమ అభిమాన ఆటగాడిగానే కాకుండా, అనేక మంది యువకులు తమకు మార్గదర్శిగా భావిస్తారు. కష్టపడి పైకి వచ్చిన విరాట్ కొహ్లి రికార్డులను కూడా అలానే కొట్టి అవతల పారేశాడు.
రికార్డుల రారాజు...
రికార్డులన్నీ కొహ్లి జేబులోనే ఉన్నాయంటే అందుకు కారణం అతని ప్రతిభ. క్రీజులో ఉన్నంత సేపు ఎంత నిలకడతనం. టెంప్ట్ కాకుండా బంతిని బౌండరీకి తరలించడంలో కొహ్లికి మించిన వారు ఎవ్వరు? చేతికి అంది వచ్చిన బాల్ ను సిక్సర్ గా మలచందే ఈ క్రికెట్ వీరుడికి నిద్ర పట్టదు. ఎన్ని రకాల షాట్లు. క్రికెట్ పండితులు కూడా అబ్బురపడేలా కొహ్లి ఆట ఉంటుంది. ఇరవై పరుగులు దాటాయంటే అర్థసెంచరీ గ్యారంటీ. అరవై పరుగులు చేశాడంటే ఇక సెంచరీకి ఏమాత్రం ఢోకా లేదు. అందుకే అంతర్జాతీయ క్రికెటర్లు కూడా కొహ్లిని అభిమానిస్తారు. అతని ఆట అంటే మక్కువ చూపుతారు. మైదానంలో మెరుపు కదలికలు కూడా కొహ్లి సొంతమే.
ఈడెన్ గార్డెన్స్ లో...
అలాంటి విరాట్ కొహ్లి పుట్టిన రోజు వేడుక ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ననంబరు 5న విరాట్ కొహ్లి పుట్టినరోజు. అదే రోజు కోల్‌కత్తాలో సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో శతకం బాదాలని ఆయన అభిమానులే కాదు క్రికెట్ అంటే తెలిసిన వారంతా కోరుకుంటున్నారనడంలో అతి శయోక్తి లేదు. విరాట్ కొహ్లి తన 35వ రోజు వేడుకలను ఈడెన్ గార్డెన్స్ లో జరుపుకుంటుండటం విశేషం. అందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొహ్లికి గుర్తుండిపోయేలా బర్త్‌డే వేడుకను నిర్వహించాలని పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. చూసేవారి రెండు కళ్లు చాలనంతగా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ కేక్.. బాణ సంచా...
ఆరోజు ప్రత్యేకంగా పెద్ద కేక్ ను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తయారు చేయిస్తుందట. దీంతో పాటు మ్యాచ్ మధ్యలో విరామం సమయంలో లైటింగ్ షో ను ఏర్పాటు చేస్తున్నారు. పెద్దయెత్తున బాణ సంచాను కాల్చాలని నిర్ణయించారు. దాదాపు 70 వేల మందికి కొహ్లి ఫేస్ మాస్కులను పంపిణీ చేయనున్నట్లు బెంగాల్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటి వరకూ 48 సెంచరీలు చేసిన విరాట్ కొహ్లి ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి తన పుట్టిన రోజు మరింత గుర్తుండిపోయేలా చూసుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. మరి విరాట్ కొహ్లి బర్త్ డే వేడుకలకు అంతా సిద్ధమయింది. ఇప్పటికే విరాట్ ఫ్యాన్స్ కోల్ కత్తా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హ్యాపీ బర్త్‌డే విరాట్... నువ్వు ఇలాగే.. ఎప్పుడూ ఆడుతుండాలని కోరుకుంటూ....