World Cup Finals 2023 : చావుదెబ్బతీయండి.. ప్రతీకారం తీర్చుకోండి.. ఇంతకు మించిన టైం ఏముంటుంది?

ఆదివారం అహ్మదాబాద్ లో టీం ఇండియాతో వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా తలపడనుంది

Update: 2023-11-17 04:29 GMT

ఆదివారం అహ్మదాబాద్ లో టీం ఇండియాతో వరల్డ్ కప్ ఫైనల్స్ లో తలపడే టీం ఎవరూ తేలిపోయింది. ఆస్ట్రేలియాతో అమీతుమీకి భారత్ సిద్ధమవుతుంది. వరల్డ్ కప్‌లో ఈసారి ఊహించనవి అన్నీ జరుగుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమైన తొలినాళ్లలో పేలవ ప్రదర్శన చూపిన జట్లు పుంజుకున్నాయి. అలాగే తొలి దశలో బాగా ఆడి పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానాన్ని చేరిన జట్లు ఇంటి దారి పట్టాయి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇందుకు ఉదాహరణ. రెండు జట్లు లీగ్ మ్యాచ్‌లు ప్రారంభంలో దడదడలాడించాయి. ఆ తర్వాత డీలా పడ్డాయి న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్స్ లో భారత్ పై ఓటమి పాలు కాగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుని, రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా జట్టు ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది.

అంచనాలకు అందని...
ఎవరూ అంచనా వేయలేని పరిస్థిితి. అంతా మనకు అనుకూలమే అనుకోలేని పరిస్థితి. అందుకే ఫేవరెట్ జట్లన్నీ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాయి. అంచనాలకు అనుగుణంగా ఒక్క టీం ఇండియా మాత్రమే ఇప్పటి వరకూ ఆడుతూ వచ్చింది. ఆడిన పదకొండు మ్యాచ్‌లలోనూ గెలిచి సత్తా చాటింది. మిగిలిన జట్ల విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ మామూలుగా ఉండదు. రెండు జట్లూ హాట్ ఫేవరెట్లే. అందుకే ఈ టెన్షన్ అంతా. చాలా కాలం తర్వాత అంటే పన్నెండేళ్ల తర్వాత చేతికి అందివచ్చిన కప్పును చేజార్చుకోకూడదని భారత్ భావిస్తుంది.
సేమ్ జట్టుతోనే...
భారత్‌ను ఎదుర్కొనడం అంత ఆషామాషీ కాదు. అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. ఒకరు ఫెయిల్ అయినా మరొకరు పుంజుకోవడం వేరు. కానీ టీం ఇండియాలో అందరూ ఫామ్‌లో ఉన్నారు. ఎవరినీ తీసిపారేయడానికి వీలులేదు. ఫైనల్స్ లో జట్టు నుంచి ఒక్కరినీ తప్పించే సాహసం చేయలేకపోతున్నారంటే అదే ఉదాహరణ. ఎవరినీ జట్టు నుంచి తప్పించి కొత్త వారికి అవకాశమిచ్చే ఛాన్స్ లేదు. ప్రయోగం చేయడానికి ఇది లీగ్ మ్యాచ్ కాదు. ఫైనల్స్. అందుకే అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. బ్యాటర్లు, బౌలర్లు అందరూ రాణిస్తుండటంతో వరల్డ్ కప్ చేజిక్కించుకోవడానికి ఇంతకు మించిన సమయం మరొకటి ఉండదని ప్రతీ క్రికెట్ ఫ్యాన్ అభిప్రాయపడుతున్నారు. ఆశలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఒత్తిడి కూడా భారత్ పై ఎక్కువగానే ఉంది.
సమిష్టిగా రాణిస్తూ...
అదే సమయంలో ఆస్ట్రేలియాను తీసిపారేయలేని పరిస్థితి. తొలి లీగ్ మ్యాచ్ మూడు మ్యాచ్ లు ఓడిపోయిన ఆస్ట్రేలియా తర్వాత పుంజుకుంది. అక్కడి నుంచి తన జోరు కొనసాగిస్తూ వస్తుంది. ఆ టీం కూడా సమిష్టిగా రాణిస్తుంది. ఆసీస్ లో అందరూ మొనగాళ్లే. చివరి బ్యాటర్ వరకూ ఎఫెన్స్ తో ఆడేవారే. అదే విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలంటున్నారు. ఆస్ట్రేలియాను లీగ్ మ్యాచ్ లో ఓడించిన భారత్ ఫైనల్స్ లోనూ ఓడిస్తుందని భావించడం పొరపాటే అవుతుంది. అయితే భారత్ కు ఆసీస్ ను కట్టడి చేయడం అంత కష్టమేమీ కాదు. రెండు దశాబ్దాల తర్వాత మరోసారి రెండు జట్లు వరల్డ్ కప్ లో తలపడుతున్నాయి. నాడు ఆస్ట్రేలియా కొట్టిన చావుదెబ్బకు ఇప్పుడు ప్రతీకారం తీల్చుకోవాల్సిన సమయం వచ్చింది. గెట్ రెడీ టీం ఇండియా... మనదే గెలుపు.. మనదే కప్పు.
Tags:    

Similar News