Australia : వీళ్ల బలుపు చూశారా? గెలిచినంత మాత్రాన ఇలా చేయాలా?
వరల్డ్ కప్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసిస్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి కప్పును సొంతం చేసుకుంది
వరల్డ్ కప్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసిస్ ఆటగాళ్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించి కప్పును సొంతం చేసుకున్నారు. ఆరోసారి తమ దేశానికి వరల్డ్ కప్ ను అందించారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ఆటలో ఎవరు ఎక్కువ పనితీరు కనపరిస్తే వారినే విజయం వరిస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా అంతే. తమ సొంత మైదానం కాకపోయినా.. స్టేడియం మొత్తం భారత్ కు మద్దతు తెలుపుతున్నా తాము ఆట మీద దృష్టి పెట్టి విక్టరీని సాధించారు.
అందరూ మెచ్చుకుని...
భారతీయులతో సహా అందరూ ఇండియా ఓటమి పాలయిన సమయంలో కొంత బాధపడినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియా ఆడిన తీరును ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అభినందించారు కూడా. వారికి ఆటపై ఉన్న మక్కువ, కసి వారిని గెలుపు దిశగా తీసుకెళ్లిందని సరిపెట్టుకున్నారు. మరోసారి మనకు ఛాన్స్ రాకపోతుందా? అన్న ఆశావాదంతో స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు.
మందుకొట్టి...
కప్ గెలిచిన తర్వాత హోటల్ గదులకు వెళ్లిన వాళ్లు సంబరాలు చేసుకున్నారు. తప్పులేదు. మందు తాగారు. అదీ నేరం కాదు. కానీ తాము దక్కించుకున్న కప్ పై కాళ్లు పెట్టి మందుతాగుతుండటమే ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇది అవమానించడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ఒక చేత్తో మందుబాటిల్ పట్టుకుని రెండు కాళ్లు వరల్డ్ కప్ పై పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేనిజమైతే మాత్రం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పెద్ద తప్పు చేసినట్లే. గౌరవం లేకుండా వ్యహరించినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.