World Cup 2023 : లంక ఇంటికే... బంగ్లా చేతిలో ఓటమి
బంగ్లాదేశ్ - శ్రీలంక మ్యాచ్ లో బంగ్లదేశ్ విజయం సాధించింది
వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ సయమం దగ్గరపడుతున్న సమయంలో కొన్ని జట్లు ఇప్పటికే ఇంటి బాట పట్టాయి. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ - శ్రీలంక మ్యాచ్ లో బంగ్లదేశ్ విజయం సాధించింది. దీంతో శ్రీలంక సెమీ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ కూడా బరి నుంచి తప్పుకుంది. బంగ్లాదేశ్ ఎనిమిది మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ లను మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
సెమీ ఫైనల్స్ రేసు నుంచి..
శ్రీలంకది కూడా అదే పరిస్థితి. కొంత సెమీ ఫైనల్స్ రేసులో ఉన్న శ్రీలంక జట్టు ఈ ఓటమితో ఇంటికి పయనమయింది. ఢిల్లీలో జరిగిన బంగ్లాదేశ్ శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసింది. దీంతో 280 పరుగుల ఛేదన లక్ష్యంగా క్రీజులోకి దిగిన బంగ్లాదేశ్ కుదురుగానే ఆడింది. ఈ ఆట జరిగే సమయంలోనే శ్రీలంక బోర్డును ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని లంకేయులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
భారీ లక్ష్యాన్ని...
బంగ్లా ఆటగాడు నజ్ముల్ శాంటో 90, కెప్టెన్ షకీబ్ 82 పరుగులు ఆడి శ్రీలంకపై విజయం సాధించేలా చేశారు. శ్రీలంక ఆటగాళ్లలో అసలంక 108, నిశాంక 41, సమర విక్రమ 41 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఉంచినా బంగ్లాదేశ్ పెద్ద కష్టపడకుండానే టార్గెట్ ను రీచ్ అయింది. కేవలం ఏడు వికెట్లు కోల్పోయి 41 ఓవర్లలోనే శ్రీలంకపై విజయం సాధించింది. ఈ రెండు జట్లు సెమీ ఫైనల్స్ కు చేరే విషయం కష్టమని తేలడంతో పెద్దగా ఆట పట్ల అభిమానులు ఎవరూ దృష్టి పెట్టలేదు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత ఉండటంతో మొదట మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచింది.