T20 World Cup : ఊహించినట్లే జరిగిందిగా.. పాక్ ఇక ఇంటికే.. ఆటతీరుపై స్వదేశంలో ఆగ్రహం

అమెరికా - ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్ ఇక సూపర్ 8కి ప్రవేశించే అర్హత కోల్పోయింది.

Update: 2024-06-15 04:12 GMT

పాకిస్థాన్ ఆటగాళ్లు ఈ టీ20 వరల్డ్ కప్ లో ప్రదర్శించిన ఆట తీరుపై ఆ దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రజలు కూడా పాక్ ఆటగాళ్ల పెర్‌ఫార్మెన్స్ పై మండిపడుతున్నారు. వరస ఓటములతో కనీసం సూపర్ 8కు చేరుకోవడంపై పాక్ జట్టుపై ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. పాకిస్థాన్ సూపర్ 8 నుంచి నిష్క్రమించింది. నిన్న అమెరికా - ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్ ఇక సూపర్ 8కి ప్రవేశించే అర్హత కోల్పోయింది. పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ ఈ నెల 16వ తేదీన ఐర్లాండ్ తో ఆడి గెలిచినా ఫలితం లేదు. అందుకే ఇక సూపర్ 8 కు చేరుకోలేక పాక్ ఇక ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

వరస వైఫల్యాలు...
పాకిస్థాన్ టీ 20 వరల్డ్ కప్ లో వరస వైఫల్యాలను చవి చూసింది. వరసగా అమెరికా, భారత్ పై ఓటమి పాలయింది. కెనడా మీద మాత్రం గెలిచి రెండు పాయింట్లు సాధించింది. అదే ఇప్పుడు పాకిస్థాన్ పాలిట శాపంగా మారింది. అమెరికాపై గెలిచి ఉంటే భారత్ తో పాటు సూపర్ 8కి పాకిస్థాన్ సులువుగా ఎంట్రీ ఇచ్చేది. అమెరికా మీద ఓడిపోయి చేజేతులా ఈ పరిస్థితిని పాక్ కొని తెచ్చుకున్నట్లయింది. అందరూ అనుకున్నట్లే నిన్న అమెరికా - ఐర్లాండ్ మ్యాచ్ నిలిచిపోతే పాక్ కు ఇబ్బంది తప్పదని అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్టే వర్షం పడటంతో అమెరికా, ఐర్లాండ్ కు చెరొక పాయింట్ రావడంతో అమెరికాకు ఐదు పాయింట్లతో సూపర్ 8కు చేరింది.
తొలిసారి అమెరికా...
సూపర్ 8 లో అమెరికా తొలిసారి ప్రవేశించింది. క్రికెట్ లో అమెరికాను పసికూనగా భావిస్తారు. అలాంటి అమెరికా చేతిలో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో పాకిస్థాన్ ఓటమిని చవి చూసింది. దీంతోపాటు భారత్ పై ఓటమిని కూడా పాక్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అతి తక్కువ ధర చేసిన భారత్ స్కోరును అధిగమించలేక చేతులెత్తేసిన పాక్ ఆటగాళ్లపై అక్కడి ప్రజలు మండి పడుతున్నారు. పాక్ క్రికెట్ విశ్లేషకులు సయితం ఈ జట్టు ఆటతీరుపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. క్రికెట్ లో బలమైన పాకిస్థాన్ జట్టు ఇలా సూపర్ 8కు చేరుకోకుండా ఇంటిదారి పట్టడంపై బాబర్ సేనపై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News