World cup 2023 : అందరూ అందరే... ఎవరూ ఎవరికీ తీసిపోరుగా

భారత్‌ జట్టులో అందరూ రాణిస్తున్నారు. సమిష్టి కృషితో టీం ఇండియా వరస విజయాలతో వరల్డ్ కప్‌లో దూసుకెళుతుంది

Update: 2023-10-23 06:09 GMT

సొంత గడ్డ అని కాదు కానీ.. భారత్‌ జట్టులో అందరూ రాణిస్తున్నారు. సరైన సమయంలో అందుబాటులోకి వస్తుండటంతో టీం ఇండియా వరస విజయాలతో వరల్డ్ కప్‌లో దూసుకెళుతుంది. ఇప్పటి వరకూ జరిగిన ఐదు మ్యాచ్‌లలో ఎక్కువగా ఛేజింగ్‌తోనే జయాన్ని తన వైపునకు రప్పించుకుంది. అందుకు బౌలర్లు కొంత కారణమయితే, బలమైన బ్యాటింగ్ కూడా మరొక కారణంగా చూడాలి. ఇప్పుడు టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ను చూస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఒకరు అవుటయ్యారన్న బెంగ లేదు. మరొకరు ఉన్నారన్న ధీమా పుష్కలంగా ఉంది. రోహిత్ శర్మ నుంచి జడేజా వరకూ అందరూ పోటుగాళ్లే. చితక్కొట్టి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించగల సత్తా ఉన్నోళ్లే.

అదే ధైర్యం...
అదే భారత్ అభిమానులకు ధైర్యం. గతంలో మాదిరిగా ఇప్పుడు టీం ఇండియా లేదు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. వరల్డ్ కప్‌లో ఇది రుజువవుతుంది. అంతా సవ్యంగా జరిగితే వరల్డ్ కప్‌లోనూ ఇండియా విజయ తీరాలకు చేరడం ఎంతో దూరం లేదు. కప్పు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది క్రీడా నిపుణుల అంచనా. ఇలాగే ఆటగాళ్లు ఫామ్ ను కొనసాగిస్తే చాలు ఇక వీరవిహారమే. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా దూసుకెళ్లి వరల్డ్ కప్ ను అందుకుంటారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
నిద్ర లేకుండా...
రోహిత్ శర్మ దూకుడు చూస్తే చాలు ప్రత్యర్థులకు వణుకు తెప్పిస్తున్నాడు. భయం, బెరుకు ఏమాత్రం లేకుండా ఫోర్లు, సిక్సర్లు బాది వదిలి పెడుతున్నాడు. రోహిత్ పది ఓవర్లు ఉంటు చాలు ఇక స్కోరు బోర్డు పరుగును ఆపడం ఎవరి తరమూ కాదు. శుభమన్ గిల్ కూడా అంతే. కుదురుకున్నాడంటే అంతే. మినిమమ్ ఫిఫ్టీ గ్యారంటీ ఆటగాడుగా పేరు పొందాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ నిజంగా ఈ వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్నాడు. కొహ్లి క్రీజులో ఉంటే విజయం మనదేనన్నది ఇండియా ఫ్యాన్స్ ధీమా. అలాగే వరుస విజయాలను ఇండియాకు కొహ్లి అందిస్తూ వస్తున్నాడు.
ఇదే ఫామ్ ను...
ఇక శ్రేయస్ అయ్యర్ ను కూడా తీసిపారేయడానికి వీలులేదు. బాగానే ఆడుతున్నాడు. మంచిషాట్లు కొడుతూ స్కోరును పెంచుతూ తర్వాత వచ్చే వారికి పెద్దగా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. కెఎల్ రాహుల్ అయితే ఏమని చెప్పాలి? ఎంత కుదురుగా ఆడతాడు? బంతి పైకి లేవకుండా ఫోర్లు కొట్టడంలో రాహుల్ తర్వాతే ఎవరైనా ఇక జడేజా కూడా అంతే. పెద్దగా భయపడడు. టార్గెట్ ఎంత అయినా జడేజా క్రీజులో ఉంటే అదో భరోసా. ఇక బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, షమి, కులదీప్ యాదవ్, జడేజాలు ప్రత్యర్థి జట్లు పెద్దగా స్కోరు చేయకుండా నిలువరించి బ్యాటర్లకు మార్గం సుగమమం చేస్తున్నారు. అందుకే టీం ఇండియాదే కప్ అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. ఇదే పంథాను ఇండియాను కొనసాగించాలని కోరుకుందాం.


Tags:    

Similar News