T20 World Cup 2024 : మజా అంటే ఆరోజు కదా? ఆరోజు రోమాలు నిక్కబొడుచుకోక తప్పదా? రొమ్ము విరుచుకుంటామా?
టీ 20 వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీం ఇండియా సెమీస్ లోకి వెళుతుందని మాజీ క్రీడాకారుల అంచనా
టీ 20 వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీం ఇండియా సెమీస్ లోకి వెళుతుందని మాజీ క్రీడాకారులందరూ అంచనా వేస్తున్నారు. గ్రూపు ఎలో భారత్ సులువుగా బయటకు వచ్చి సెమీస్ లో అడుగుపెడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే టీ 20 కావడంతో ఆరోజు ఎవరిది పై చేయి అవుతుందో వారిదే ఆరోజు అవుతుంది. సమిష్టిగా రాణించగలిగితేనే ఏ జట్టుకయినా విజయావకాశాలుంటాయి. అందుకే అంచనాలు ప్రకారం ఏదీ జరగకపోయినా.. జట్టు బలాబలాబలాలు ట్రాక్ రికార్డులను చూస్తే మాత్రం కొంత వరకూ ఒక అంచనాకు వచ్చే అవకాశముంటుంది.
మునికాళ్ల మీద నిలబడి మరీ...
గ్రూపు ఎలో భారత్ ఆడే అన్ని మ్యాచ్ లు ఒక ఎత్తు. జూన్ 9వ తేదీన పాకిస్థాన్ తో ఆడబోయే మ్యాచ్ మరొక ఎత్తు. ఎందుకంటే భారత్ - పాక్ మ్యాచ్ అంటే రెండు దేశాల క్రికెట్ అభిమానులు మునికాళ్లమీద లేచి నిలుచున్నంత పనిచేస్తారు. పాక్ తో మ్యాచ్ సాధారణంగా వన్ సైడ్ గా జరగదు. బంతి బంతికి ఉత్కంఠ ఉంటేనే మజా అంటారు. రెండు దేశాలు ప్రత్యర్థులుగా మైదానంలో తలపడతుంటే.. ఇరు దేశాల్లో టీవీల్లో కూర్చుని కూడా ప్రత్యర్థుల్లా ఫీలవుతూ ఆటను ఎంజాయ్ చేస్తుంటారు. ఓటమి కొన్ని గుండెలు ఆగిపోయేలా చేస్తుంది. అదే గెలుపు కొన్ని కోట్ల హృదయాలు నృత్యం చేస్తాయి. అలా ఉంటుంది పాక్ - భారత్ మ్యాచ్ అంటే.
అన్ని ఫార్మాట్లలో...
జూన్ 9వ తేదీన సండే వచ్చింది. ఇక చూస్కోండి. క్రికెట్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పక తప్పదు. న్యూయార్క్ లో జూన్ 9వ తేదీన జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మాజీ క్రికెటర్లు మాత్రం భారత్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. భారత్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉంది. అందులోనూ మొన్నటి వరకూ ఐపీఎల్ ఆడటంతో బ్యాట్ చురుగ్గా కదులుతుంది. విరాట్ కోహ్లి మంచి ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా అదే స్థాయిలో బాదితే ఇక స్కోరును ఆపడం ఎవరి తరమూ కాదు. ఇక యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా తోడయితే పరుగులను ఆపడం ఎవరితరమూ కాదు. ఇక బౌలింగ్ జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ తో పాటు ఆల్ రౌండర్లుగా చెలరేగి పోయిన అక్షర్ పటేల్, శివమ్ దూబెలు కూడా ఉన్నారు. దీంతో భారత్ అన్ని ఫార్మాట్లలో బలంగా కనిపిస్తుంది.
పాక్ జట్టు కూడా...
కానీ పాకిస్థాన్ జట్టు మాత్రం పెద్దగా పెర్‌ఫార్మెన్స్ చేసే పరిస్థితులు లేవని అంచనాలున్నాయి. అయితే ఆజట్టులోనూ అనుభవం ఉన్న ప్లేయర్లున్నారు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది వంటి వారు మ్యాచ్ ను మలుపు తిప్పే శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ ఇప్పటి వరకూ గణాంకాలు చూసినప్పుడు భారత్ దే పైచేయిగా కనిపిస్తుంది. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లో భారత్ - పాక్ తలపడితే భారత్ ఆరు మ్యాచ్ లలో గెలిచింది. పాక్ ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. కానీ ఎవరినీ తక్కువ, ఎక్కువగా అంచనాలు వేయడానికి వీలులేని జట్టు ఇది. ఉన్నట్లుండి మైదానంలో వీరవిహారం చేయడంలో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఆరితేరి ఉంటారు. అందుకే సండే రోజున అసలైన మజా ఉంటుంది. రాత్రి ఎనిమిది గంటలకు న్యూయార్క్ లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అర్థరాత్రి మ్యాచ్ అయినా టీవీలు ఆపేయకుండా టీ 20 వరల్డ్ కప్ లో చూసే ఏకైక మ్యాచ్ ఇదేనని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.