T 20 World Cup 2024 : నేడు భారత్ - పాక్ టీ 20 మ్యాచ్ .. వరుణుడు కరుణిస్తేనే?

భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే అందరికీ ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ ఇది

Update: 2024-06-09 04:08 GMT

భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే అందరికీ ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ ఇది. టీవీలకు అతుక్కుపోయి చూసే మ్యాచ్ భారత్ - పాక్ మ్యాచ్. ఇరు దేశాలు నువ్వా? నేనా? అన్న రీతిలో అనేక మ్యాచుల్లో తలపడటమే ఇందుకు కారణం. అందుకే ఇటు భారత్ లోనూ, అటు పాక్ లోనూ ఈ మ్యాచ్ పై పెద్ద ఆశలుంటాయి. అభిమానుల ఆశలతో ఆటగాళ్లపై వత్తిడి సహజంగానే పెరుగుతుంది. అలాగని మైదానంలో వీరి పెర్‌ఫార్మెన్స్ లో ప్రతి కదలికనూ ప్రతి ఒక్కరూ నిశితంగా గమనిస్తారు. అందులోనూ క్యాచ్ మిస్ అయినా తిట్ల పురాణమే. అవుటయనే తిట్ల దండకమే. ఫోర్ కొడితే పూజలు కూడా చేయడం ఈ మ్యాచ్ కు ఉన్న ప్రత్యేకత. అలాంటి మ్యాచ్ నేడు జరగనుంది. ఉగ్గబట్టి మునికాళ్ల మీద నిలబడి చూసే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్ - పాక్ మ్యాచ్ మాత్రమే.

తెగించి.. కసితో...
రెండు జట్లలో ఒకటి గెలవడం.. మరొకటి ఓడటం సర్వసాధారణమయినా ఇరుదేశాల ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు మాత్రమే గెలవాలని పట్టుబట్టి కూర్చుంటారు. పంతం పడతారు. అదే అసలు సమస్య. నేడు న్యూయార్క్ లో జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్ పట్ల ఇప్పటి నుంచే అంచనాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఐర్లాండ్ మీద భారత్ గెలిచి ఊపు మీదుంది. పాక్ మీద కూడా గెలిస్తే సూపర్ 8కు చేరువవుతుంది. మరో వైపు పాకిస్థాన్ పసికూన అమెరికా చేతిలో ఓటమి పాలయింది. అది కసితో రగలి పోతుంది. భారత్ కు ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో పాక్ కు అంతకంటే ఎక్కువ ముఖ్యం. పాక్ తెగించి ఆడాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్ పరంగా చూస్తే ఎన్నో సానుకూలతలు. పాక్ పరంగా చూస్తే ఎన్నో ప్రతికూలతలు. అందువల్లనే ఈ మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నది క్రీడా నిపుణుల అంచనాగా వినపడుతుంది.
రెండు జట్లు...
న్యూయార్క్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. అందుకే పాక్ ఆశలు పెట్టుకుంది. ఆ టీంలో షహీన్ అఫ్రిదీ, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ అమీర్ తో సిద్ధంగా ఉంది. అలాగే భారత్ కూడా జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, సిరాజ్, హార్ధిక్ వంటి బౌలర్లు ఉండటంతో బెంగ లేదు. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్ పటిష్టంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్ధిక్ పాండ్యా వంటి వారితో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకూ టీ 20 కప్ లో ఏడుసార్లు రెండు దేశాలు తలపడగా, ఆరుసార్లు భారత్ ఒకసారి పాకిస్థాన్ గెలిచింది. అంకెలు కూడా మనకే ఫేవర్ గా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో ఆ గండం కూడా పొంచి ఉంది. మొత్తం మీద నేడు బిగ్ ఫైట్ జరగనుంది.


Tags:    

Similar News