World Cup Finals 2023 : సంబరపడినంత సేపు లేదు... చతికలపడటానికి

ఆస్ట్రేలియా పై భారత్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓటమి పాలు కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు;

Update: 2023-11-20 04:22 GMT

బలవంతులమనుకున్నాం. మనమే ముందున్నామని సంబరపడ్డాం. తిరుగులేదని భావించాం. ఎన్ని ఆశలు.. పన్నెండేళ్ల తర్వాత కోరిక నెరవేరబోతుందన్న కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఆవిరయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ క్షణాల కోసం పన్నెండేళ్లు వెయిట్ చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా జట్టు బలంగా ఉందని జబ్బలు చరచుకున్నంత సేపు లేదు కప్పును కోల్పోడానికి. ఈ వరల్డ్ కప్ లో భారత్ - ఆస్ట్రేలియాపై ఓటమి పాలు కావడాన్ని అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కల అయితే ఎంత బాగుండు అని అనుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంతగా మదనపడుతున్నారో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఓటమి చెందారని విమర్శలు చేయడం కాదు కానీ.. జరిగిన తప్పొప్పులను సమీక్షించుకుని ముందుకు వెళ్లడమే మంచిది.

వరసగా గెలిస్తే...
పది మ్యాచ్ లలో వరసగా గెలిస్తే మనోళ్లంత పోటుగాళ్లు లేమని చంకలు ఎగరేశాం. కానీ ఏమైంది? దారుణ ఓటమి. ఒక్కొక్క ఆటగాడు తన ఫెయిల్యూర్ ను ఫైనల్ లో బయట పెట్టేశాడు. అది ఫైనల్ మ్యాచ్. జాగ్రత్తగా ఆడాలని తెలుసు. కానీ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఏం చేశాడు? అప్పటి వరకూ స్కోరును పెంచుతూ ఆశలు పెంచిన రోహిత్ ఎప్పటి మాదిరిగానే 47 పరుగుల వద్ద అవుటయ్యాడు. గతంలో జరిగిన ఘటనలు కూడా రోహిత్ కు గుర్తుకు రాలేదేమో. తాను కొద్దిసేపు ఉంటే ఎక్కువ స్కోరు వస్తుందని అనుకోలేదేమో. అనవసర షాట్ కు ప్రయత్నించి బంతిని పైకి లేపి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఎవరూ నిలకడగా...
ఇక శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియాకు దొరికన తురుపు ముక్క అని అనుకున్నాం. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి, సిక్సర్ల మోత మోగించి మనల్ని ఎక్కడకో తీసుకెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చి డకౌట్ అయి వెళ్లాడు. విరాట్ కోహ్లి ఎప్పటిలాగే తన రికార్డు కోసం హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ దారి పట్టాడు. కేఎల్ రాహుల్ ఒక్కడే భారీ స్కోరు చేశాడు. ఇక సూర్యకుమార్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఆల్ రౌండర్ గా పేరున్న జడేజా కూడా ఫైనల్స్ పేలవ ప్రదర్శన చేశాడు. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. ఎవరూ నిలబడలేక కప్పును చేజేతులా చేజార్చుకున్నారు.
బౌలర్లు కూడా...
బౌలింగ్ లోనూ అంతే తొలి మూడు వికెట్లు తీయడంతో సంబరపడినంత సేపు లేదు. మరో వికెట్ తీయడానికి దాదాపు 35 ఓవర్ల సమయం పట్టిందంటే ఏమనుకోవాలి? ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల జంటను విడదీయలేక పడిన అవస్థలు చూస్తుంటే వీళ్లా ఈ పది మ్యాచ్‌లలో వికెట్లు తీసింది అన్న డౌట్ అందరికీ వచ్చింది. ప్రతి ఆటగాడిపై ఎంత నమ్మకం? ఎంత విశ్వాసం? కానీ అసలు సమయంలో చేతులెత్తేసి ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. వరల్డ్ కప్ కోసం మరో నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే. అప్పటికి ఈ జట్టులో నాలుగో వంతు సభ్యులు ఖాళీ అవుతారన్న ధ్యాస కూడా లేకుండా ఆడారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఏం చేస్తాం.. మరో వరల్డ్ కప్ కోసం.... నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News