World cup 2023 : ఆప్ఘాన్ సంచలన గెలుపు వెనక మనోడే
ఆప్ఫనిస్తాన్ వరస విజయాల వెనక మాజీ టీం ఇండియా సభ్యుడు అజయ్ జడేజా ఉన్నాడు
పాకిస్థాన్ పై ఆప్ఫనిస్తాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా ఇంగ్లండ్ ను ఓడించి తాము వరల్డ్ క్లాస్ టీంలతో ఏమాత్రం తీసిపోమని నిరూపించింది. నిన్న మొన్నటి వరకూ ఆప్ఫనిస్తాన్ ను చిన్న జట్టుగా చిన్న చూపు చూసిన వారే. వారితో గేమ్ అంటే సీరియస్ గా తీసుకోరు. లైట్ తీసుకుని బెంచ్ మీద ఉన్న వారికి ప్రధాన టీంలు అవకాశాలు కల్పించేవి. తమ టీంలలో ప్రయోగాలు చేసుకునేందుకు ఆప్ఫనిస్తాన్ తో మ్యాచ్‌లోనే ఎక్కువగా జరుగుతుంది. కానీ కొన్నేళ్లుగా కష్టపడుతున్న ఆ టీం క్రమంగా రాణిస్తుంది.
రెండు విజయాలతో...
వరసగా రెండు సంచలన విజయాలను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇంగ్లండ్ ను ఓడించడం ఒక సంచలనమైతే... పాకిస్థాన్ ను మట్టి కరిపించడం మామూలు విషయం కాదు. జట్టు సమిష్టిగా రాణిస్తుందనడానికి ఆ దేశానికి ఈ రెండు విజయాలు చాలు. వరల్డ్ కప్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆప్ఘాన్ జట్టు సభ్యులు అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఇప్పుడు చిన్న దేశం.. ప్రయోగాలు చేద్దామనుకునే వారికి ఆ జట్టు నేరుగానే హెచ్చరికలు పంపింది.
ఒకప్పుడు టీం ఇండియాలో...
అయితే ఆప్ఫనిస్తాన్ వరస విజయాల వెనక మాజీ టీం ఇండియా సభ్యుడు ఉన్నాడు. అతడే అజయ్ జడేజా. ఒకప్పుడు సూపర్ బ్యాటర్ గా మైదానంలో చెలరేగి ఆడే అజయ్ జడేజా ఇప్పుడు ఆప్ఫనిస్తాన్ టీంకు మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎప్పటికప్పడు జట్టు సభ్యులకు సూచనలు ఇస్తూ వారిని విజయతీరాలకు చేర్చడంలో అజయ్ జడేజా పాత్రను మరువలేం అంటున్నారు ఆప్ఘన్ జట్టు సభ్యులు. పసి కూనలో కసి పెంచడానికి కారణం అజయ్ జడేజాయే కారణమని చెబుతున్నారు.
భారత్ తరుపున...
అజయ్ జడేజా భారత్ తరుపున పదిహేను టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 1992 నుంచి 2000 వరకూ జడేజా జట్టులోనే ఉన్నాడు. మంచి బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జడేజా ఫీల్డింగ్ లోనూ మైదానంలో చురుగ్గా ప్రదర్శన చేసేవాడు. 1996 వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ లో పాకిస్థాన్ పై కేవలం ఇరవై ఐదు బంతుల్లో 45 పరుగులు చేశాడు. అలాగే బౌలర్ గా షార్జాలో ఓకే ఓవర్ లో మూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తీసి ఇంగ్లండ్ పై విజయం సాధించేందుకు దోహదపడ్డాడు. పదమూడు సార్లు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అలాంటి జడేజా ఇప్పుడు ఆప్ఫనిస్తాన్ మెంటర్ గా వ్యవహరిస్తూ ఆ జట్టును వెనకుండి నడిపిస్తున్నాడు.