T20 World Cup 2024 : ఇది సరే బాసూ.. వచ్చే మ్యాచ్ లు ఇలాగే ఆడితే ఎలా డ్యూడ్

టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా సూపర్ ఎయిట్ లోకి ప్రవేశించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా అమెరికాపై కష్టపడి నెగ్గింది

Update: 2024-06-13 04:20 GMT

టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా సూపర్ ఎయిట్ లోకి ప్రవేశించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా అమెరికాపై కష్టపడి నెగ్గింది. ఇప్పటి వరకూ మూడు జట్లపై విజయం సాధింంచి ఎ గ్రూపులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా సూపర్ 8కు చేరుకుంది. అయితే అమెరికాతో పాటు ఐర్లాండ్, పాకిస్థాన్ తో భారత్ ఆడిన తీరు క్రికెట్ ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తున్నాయి. పసికూనలపై ఆట ఇలా ఉంటే ఇక దిగ్గజ ఆటలతో ఎలా ఆడతారన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరింది. బ్యాటింగ్ పరంగా ఘోరంగా వరసగా విఫలమవుతుండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

చిన్న లక్ష్యమయినా...
నిన్న అమెరికాతో జరిగిన మ్యాచ్ లో తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ మంచి ఆరంభాన్ని ప్రారంభించింది. బౌలర్లు అమెరికా బ్యాటర్లను నిలువరించగలిగారు. ఇరవై ఓవర్లలో 111 పరుగులు మాత్రమే అమెరికా చేయగలిగింది. ఇది టీ 20 లలో పెద్ద స్కోరు కాదు. అదీ భారత్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే అలివి కాని అంకె కూడా కాదు. కానీ తడబడ్డారు. ఇబ్బందిపడ్డారు. చివరికి నెగ్గినా అభిమానులు మాత్రం త్వరలో జరగబోయే కీలక మ్యాచ్ లు ఎలా ఆడతారన్న దిగులు అందరిలోనూ ఉంది. అమెరికా తొలుత బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేసింది. అర్షదీప్ సింగ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా, హార్థిక్ పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. దీంతో అమెరికా స్వల్ప పరుగులకే అవుట్ కాగలిగింది.
వరసగా విఫలమవుతూ...
కానీ వరసగా మన బ్యాటర్లు విఫలమవుతూ వస్తున్నారు. ఐర్లాండ్ పై హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ తర్వాత పాకిస్థాన్ మ్యాచ్ లో పెద్దగా పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు కూడా కేవలం మూడు పరుగులకే అవుటయ్యాడు. విరాట్ కోహ్లి అయితే వరసగా మూడు మ్యాచ్ లలోనూ విఫలమయ్యాడు. నిన్న అమెరికాతో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. పంత్ పద్దెనిమిది పరుగులు చేసి పరవాలేదనిపించుకున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, శివమ్ దూబె 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించారు. 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించారు. అయితే ఈ గెలుపు తర్వాత మ్యాచ్ లపై అనుమానాలు కలుగుతున్నాయి. మనోళ్లు ఫామ్ లో లేరా? పిచ్ అంతేనా? అన్నది తేలకున్నప్పటికీ.. వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలంటే ఈ రకమైన పెర్‌ఫార్మెన్స్ మాత్రం సరిపోదన్నది అందరూ అంగీకరిస్తున్న విషయం.


Tags:    

Similar News