కొహ్లి క్రీజులో ఉంటే అదొక ధైర్యం

వరల్డ్ కప్‌లో భారత్ జోరు మీదుంది. వరసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలచింది

Update: 2023-10-20 04:12 GMT

వరల్డ్ కప్‌లో భారత్ జోరు మీదుంది. వరసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలచింది. బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్ ను చూసుకుంటే టీం ఇండియా ఓపెనర్లు ఇద్దరూ బాగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్ ఇన్నింగ్స్ మరోసారి ఆడాడు. 48 పరుగులకు అవుట్ కావడం రోహిత్ అభిమానులకు కొంత నిరాశపర్చింది. రోహిత్ అవుటయిన తర్వాత విరాట్ కొహ్లి వచ్చిన తర్వాత శుభమన్ గిల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రే‍యస్ అయ్యర్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కొంత ఇండియా ఫ్యాన్స్ లో కలవరం కనిపించినా విరాట్ కొహ్లి కుదురుకోవడంతో విజయం పట్ల పూర్తి నమ్మకంతోనే ఉన్నారు.

దూకుడు షాట్లకు...
విరాట్ కొహ్లి ఎక్కువగా షాట్లకు ప్రయత్నించరు. విరాట్ దగ్గర ఒకటుంది. 20 లోపు పరుగులకు అవుటయితే అవుటయినట్లు. లేకుంటే హాఫ్ సెంచరీ చేసినట్లే. 70 దాటితే సెంచరీ చేసినట్లే. అందులోనూ ఛేజింగ్‌లో విరాట్ కు మించిన వారు మరొకరు ఉండరు. కూల్ గా నవ్వుతూనే మ్యాచ్ ను ముగించడం అలవాటుగా మార్చుకున్నాడు. సిక్సర్లు తక్కువ. అప్పుడప్పుడు ఫోర్లు. అంతకు మించి ఛేదనలో ఒకటి, రెండు పరుగులు చేయడానికే విరాట్ ఎక్కువగా ఇష్టపడతాడు. బంతి ప్రత్యర్థులకు చిక్కకుండా షాట్ కొట్టడంలో విరాట్ ను మించిన వారు లేరని పిస్తుంది. అందుకే విరాట్ క్రీజులో ఉంటే అదో ధైర్యం. అందరికీ గెలుస్తామన్న నమ్మకం. ఆ నమ్మకమే నిజమైంది. అందుకే విరాట్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. చివరకు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సెంచరీ కొట్టి...
విరాట్ కొహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం విశేషం. విరాట్ సెంచరీ కోసం మరో వైపు ఉన్న కేఎల్ రాహుల్ సహకరించడం కూడా అంతే విశేషం. రికార్డుల కోసం కాకపోయినా అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. ఇక సెంచరీ ఒక్కటే మిగిలింది. అందుకే రాహుల్ ఎక్కువగా బౌలర్ ఎండ్ వైపు ఉండేందుకే ప్రయత్నించాడు. విరాట్‌కు బ్యాటింగ్ ఇచ్చి సెంచరీకి సహకరించాడు. దీంతో కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియాలో రాహుల్ ను పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 257 పరుగుల లక్ష్యాన్ని ఇంకా తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే ఛేధించి భారత్‌ను కొహ్లి విజయతీరాలకు చేర్చాడు.


Tags:    

Similar News