T20 World Cup 2024 : గెలిచేది మనమే... గెలిపించేది వాళ్లేనట.. అంచానాలు మాత్రం అదుర్స్
ఈరోజు రాత్రికి భారత్ - పాకిస్థాన్ టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ లో జరగనున్న తొలి సమరం.
ఈరోజు రాత్రికి భారత్ - పాకిస్థాన్ టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ లో జరగనున్న తొలి సమరం. అత్యంత టెన్షన్ పెట్టేసే మ్యాచ్ ఇది. కేకలు పుట్టించే కిరాక్ గేమ్ ఇది. చూడటానికి రెండు కళ్లూ చాలవు. వరల్డ్ కప్ అందులోనూ.. పాక్ - భారత్ తలపడుతున్న తొలి పోరు. ఇంతకంటే క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం కావాలి? కళ్లార్పకుండా చూడటానికి ఇంతకంటే మించిన మ్యాచ్ ఏముంటుంది. రెండు జట్లను పరిశీలిస్తే అంచనాలకు అందడం లేదు. గ్రౌండ్ లో ఎవరిది ఆధిపత్యమో వారిదే చివరకు గెలుపు అవుతుంది. భారత్ - పాక్ మ్యాచ్ అంటే పిచ్చెక్కిపోతుంది. ఒక మ్యానియా లాంటిది. క్రికెట్ ప్రేమికులకు అన్ని రకాలుగా బఫే భోజనం అందించే మ్యాచ్ ఇది.
ఎన్నో ఆశలు...
అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టును పక్కన పెడితే భారత్ బ్యాటర్లపై ఎన్నో ఆశలున్నాయి. పేసర్లను సులువుగా ఎదుర్కొనడంలో మనోళ్లు అందె వేసిన చేయి. అయితే ఆచితూచి జాగ్రత్తగా ఆడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె ఎంత సేపు ఉంటే అంత రన్స్ వచ్చి పడతాయి. రోహిత్ శర్మ మంచి ఫామ్ లోకి వచ్చేశాడు. ఐపీఎల్ లో కొంత ఇబ్బంది పడినా తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ ఐర్లాండ్ పై చేశాడు. దీంతో రోహిత్ శర్మ ఉంటే చాలు సికర్లు,ఫోర్లతో విరుచుకుపడతాడు. ఇక విరాట్ కోహ్లిని ప్రత్యర్థులు ఎవరూ తక్కువగా అంచనా వేయరు. కోహ్లిని త్వరగా అవుట్ చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి నిరాశపర్చాడు. ఈ మ్యాచ్ లో బాగా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లి ఇరవై పరుగులు దాటితే చాలు హాఫ్ సెంచరీ గ్యారంటీ అన్న నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది.
స్కైకి మించిన...
ఇక సూర్యకుమార్ యాదవ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. మిస్టర్ 360 గా పేరుంది. గ్రౌండ్ నలుమూలలకు బంతిని తరలించడంలో చేయి వేగంగా తిప్పడంలో స్కైకి మించిన వారు లేరు. అయితే కుదురు కోవాలి. నిలకడగా ఆడుతూనే బంతిని బాదాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో పెద్దగా రాణించకపోయినా ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోతాడన్నది క్రీడా నిపుణుల అంచనా. అందుకే సూర్యకుమార్ యాదవ్ పై భారీగా ఆశలున్నాయి. ఇక శివమ్ దూబే గురించి చెప్పాల్సిన పనిలేదు. శివమ్ దూబే నిల్చుని అలవోకగా సిక్సర్ కొట్టేస్తాడు. డెత్ ఓవర్లన్న భయం ఏమాత్రం ఉండదు. ఉన్నాడంటే.. బాదాడంతే.. అన్న తరహాలో గేమ్ ఉంటుంది. ఇక వీరికి తోడుగా రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కూడా ఉండటంతో మన బ్యాటింగ్ బలంగా ఉందని చెప్పాలి. మరి ఈ రోజు మనోళ్లు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.