World Cup Finals 2023 : ప్రత్యర్థి ఎవరైనా.. పదకొండూ విజయం మనదేనట

వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ నుంచి భారత్ ఫైనల్స్ కు చేరుకుంది. ఈ నెల 19న అహ్మదాబాద్ లో జరగనున్న ఫైనల్స్ లో తలపడనుంది.

Update: 2023-11-16 04:20 GMT

వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ నుంచి భారత్ ఫైనల్స్ కు చేరుకుంది. ఈ నెల 19న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్ లో తలపడనుంది. అది ఆస్ట్రేలియాతోనా, సౌతాఫ్రికాతోనా? అన్నది ఇంకా తేలకున్నా... ఇక ఫైనల్స్ లోనూ ఇదే దూకుడు ప్రదర్శిస్తే కప్పు మనదే. ఇప్పటికే పది మ్యాచ్ లలో ఓటమి ఎరుగకుండా టీం ఇండియా ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది. ఫైనల్ లోనూ అదే తరహాలో ఆడాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విధంగా అందరూ సమిష్టిగా రాణించి ప్రత్యర్థి జట్టును దెబ్బతీయాలని ఆశిస్తున్నారు. భారత్ ఇప్పుడు మునుపటిలా లేదు. బలం అనే దానికన్నా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని చెప్పాలి.

ఏ జట్టు అయినా...
ఫైనల్స్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు రెండు బలమైన జట్లే. అందులో కూడా మ్యాచ్ విన్నర్లున్నారు. ఏది ఫైనల్ కు వచ్చినా ఇండియా మాత్రం అతి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో మనకు ఢోకా లేకుండా పోయింది. అందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలా అందరూ పరుగులు తీస్తూ రన్ రేటును పెంచే వారే. ఛేదనలో కూడా భయపడాల్సిన పనిలేదు. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్లు ప్రత్యర్థిపై దండెత్తుతున్నారు. వారిన ఆశలను తుత్తునియలు చేస్తున్నారు. నిన్న న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ ను చూసిన వారికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది.
టాస్ ఎవరు గెలిచినా...
అందుకే అహ్మదాబాద్ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసినా, తర్వాత టార్గెట్ ను ఛేదించడానికి దిగినా పెద్దగా భయపడాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు. ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా ఆడుతుండటం ఈ వరల్డ్ కప్ లో భారత్ కు వరంగా మారిందనే చెప్పాలి. న్యూజిలాండ్ మ్యాచ్ చేజారిపోతుందని కలవరపడిన వారికి షమి ఏడు వికెట్లు తీసి సమాధానమిచ్చాడు. నిజానికి షమిని వరల్డ్ కప్ లో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లకు దూరంగా ఉంచారు. బెంచ్ కే పరిమితం చేశారు. హార్ధిక్ పాండ్యా గాయపడిన తర్వాత షమి అవసరం తెలిసొచ్చి టీంలోకి తీసుకొస్తే తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా ముగించాడు. మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసి రికార్డు బ్రేక్ చేశాడు. అదే శార్దూల్ ఠాకూర్ ను కొనసాగించి ఉంటే మన పరిస్థితి ఏంటని ఆలోచించడానికే భయమేసేదిలా ఉంది.
ఫీల్డింగ్ లో మాత్రం...
అందుకే ఇదే జట్టుతో ఫైనల్ కు వెళ్లాలన్నది భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కోరిక. కలసి వచ్చే జట్టు ఇది. బౌలింగ్ పరంగా ప్రత్యర్థులను భయపెడుతూ తమ పని కానిచ్చేస్తున్నారు. అందుకే వరల్డ్ కప్ ఫైనల్ లోనూ భారత్ హవా కొనసాగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్టు ఏదైనా సరే... అలవోకగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇండియన్ ఫ్యాన్స్ లో ఏర్పడింది. అయితే కొంత ఫీల్డింగ్ ను మెరుగుపర్చుకోవాలన్న సూచనలు కూడా టీం ఇండియాకు అందుతున్నాయి. క్యాచ్ లు వదిలేయడం, ఎక్కువ పరుగులు ఇవ్వడం వంటి వాటికి బై చెబితే ఇక టీం ఇండియాకు తిరుగుండదని క్రీడానిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా మనం కప్పు కొట్టి కసి తీర్చుకోవాలి.


Tags:    

Similar News