T20 World Cup 2024 : బ్యాట్ కు బ్యాట్.. బంతికి.. బంతికి.. వికెట్ కు వికెట్.. కసితీర్చుకోవడమంటే ఇదే కదా భయ్యా?
టీ 20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 24 పరుగుల తేడాతో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది.
ఏమి ఆట ఇది.. చూసి తీరాల్సిందే. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు నిన్న నిజమైన పండగరోజు. వన్డే ప్రపంచ కప్ లో వరస విజయాలతో దూసుకుపోయిన టీం ఇండియాను ఫైనల్ లో ఓడించిన ఆస్ట్రేలియాపై విజయం అంటే అంతకంటే కిక్కు క్రికెట్ ఫ్యాన్స్ కు ఏముంటుంది. తనివితీరా కొన్నేళ్ల పాటు ఈ విజయం అలా గుర్తుండిపోతుంది. వన్డే వరల్ కప్ ను ఎగరేసుకుపోవడమే కాదు.. కప్ ను కాళ్ల కింద వేసుకుని అవమానపర్చిన కంగారూలను చావుదెబ్బతీసి మనోళ్లు పగ సాధించారు. ప్రతీకారం తీర్చుకున్నారు. గెలుపు ఎవడి ఒక్కడి సొంతం కాదయ్యా అన్నట్లు మనోళ్లు ఆడుతుంటే రెండు కళ్లూ చాలనంతగా చూశాం. ఇది కదా అందరూ కోరుకుంది. ఈ ఆట కదా మనం ఆశించింది.
ఆసీస్ ను ఓడించామన్నదే....
అందుకే భారత్ టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కు వెళ్లిందన్న ఆనందం కన్నా ఆస్ట్రేలియాను ఓడించిందన్న ఒక్క కారణం చాలు .. కడుపు నిండిపోయింది. నిన్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ చూసిన వాళ్లకు ఎవరైనా ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. చివరి బంతి వరకూ టెన్షన్ పెట్టినా గెలుపు మనదేనన్న ధీమాతో టీవీలకు అమాంతం అతుక్కుపోయి పన్నెండు గంటల వరకూ వీక్షించారంటే ఈ మ్యాచ్ ఎంత అద్భుతంగా జరిగిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. టీ 20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 24 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. సెమీ ఫైనల్స్ కు రారాజుగా అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా భవిష్యత్ మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఆప్ఘనిస్థాన్ - బంగ్లాదేశ్ ఫలితంపైనే బేస్ అయి ఉంది.
కెప్టెన్ ఇన్నింగ్స్ తో....
రోహిత్ శర్మ వీరవిహారం చూసి కంగారూలు నిజంగా కంగారు పడిపోయారు. ఆసిస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ప్రతి బంతినీ బౌండరీకో, సిక్సర్ కో తరలించాడు. రోహిత్ శర్మ అలాగే ఉండి ఉంటే స్కోరు 260కు సులువుగా చేరేదనిపించింది ఒక దశలో. అయితే బ్యాడ్ లక్ రోహిత్ శర్మ 92 పరుగుల వద్ద అవుటయ్యాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయంటే చితక్కొట్టాడో అర్థమవుతుంది. విరాట్ కోహ్లి ఎప్పటిలాగానే డకౌట్ తో వెనుదిరిగాడు. రిషబ్ పంత్, పదిహేను పరుగులు చేసి వెనుదిరిగినా, సూర్యకుమార్ యాదవ్ రాకతో మళ్లీ స్కోరు బోర్డు వేగం పెరిగింది. సూర్య 31 పరుగులు చేసి అవుటయ్యాడు. శివమ్ దూబె 28 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. హర్థిక్ 27 పరుగులు చేసి మంచి స్కోరు తెచ్చిపెట్టాడు. భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
మన బౌలర్ల దెబ్బకు...
వర్షం పడి ఇబ్బంది అవుతుందని భావించినా వరుణుడు కరుణించడంతో పూర్తి మ్యాచ్ ను కనులారా చూడగలిగాం. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ ను హెడ్, మార్ష్ లు కలసి ఒక దశలో స్కోరు పెంచుతూ షాట్టు కొడుతూ కొంత టెన్షన్ పెట్టారు. వాళ్లిద్దరూ క్రీజులో ఉండి షాట్స్ కొడుతుంటే భారత్ అభిమానులు ఉగ్గబట్టి చూస్తున్నారు. కానీ వార్నర్ వెంటనే అవుట్ కావడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత హెడ్, మార్ష్ భాగస్వామ్యాన్ని బుమ్రా విడగొట్టాడు. అక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం ప్రారంభమయింది. అర్షదీప్ మూడు, బుమ్రా ఒకటి, అక్షర్ పటేల్, కటి, కులదీప్ యాదవ్ రెండు, జడేజా ఒక వికెట్ తీశారు. ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 181 పరుగులు మాత్రమే చేసింది. మనకు విజయం దక్కింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.