World Cup 2023 : సెమీ ఫైనల్ లో ఇండియా తలపడే జట్టు అదేనట
భారత్ వరస విజయాలతో వరల్డ్ కప్ లో దూసుకెళుతుంది. ఇక పాయింట్లలో టేబుల్‌లో భారత్ ను కొట్టే మొనగాడు లేడు.
భారత్ వరస విజయాలతో వరల్డ్ కప్ లో దూసుకెళుతుంది. ఇక పాయింట్లలో టేబుల్‌లో భారత్ ను కొట్టే మొనగాడు లేడు. ఇప్పటి వరకూ వరసగా ఎనిమిది విజయాలు సాధించి పదహారు పాయింట్లు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది. మిగిలిన జట్లు కొన్ని ఓటములు చవి చూడటంతో ఇక పాయింట్ల పట్టికలో భారత్ ఉన్న ప్రధమ స్థానానికి చేరుకునే అవకాశం లేదు. సెమీ ఫైనల్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వరస విజయాలను సాధిస్తూ టీం ఇండియా వరల్డ్ కప్ ను కూడా కైవసం చేసుకుంటుందని ఆశలు పెరుగుతున్నాయి.
వరస విజయాలతో...
టీం ఇండియా న్యూజిలాండ్ జట్టును నలిపేసింది. ఆస్ట్రేలియాను ఒక ఆటాడుకుంది. పాకిస్థాన్ పీచమణిచేసింది. బంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆప్ఘనిస్థాన్ ను ఆవలికి నెట్టేసింది. ఇంగ్లండ్ ను ఇంటికి పంపేసింది. శ్రీలంకతో చెడుగుడు ఆడుకుంది. ఇక తాజాగా సౌతాఫ్రికా మీద అఖండ విజయాన్ని అందుకుంది. శ్రీలంక, సౌతాఫ్రికా జట్లపై దాదాపు రెండు వందలకు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలర్ల పరంగా బలంగా ఉన్న భారత్ జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అదే ఛాన్స్ వస్తే...
ఇక ఈ నెల 12వ తేదీన నెదర్లాండ్స్ జట్టు మీద మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కూడా గెలిస్తే వరల్డ్ కప్ లో భారత్ రికార్డు సృష్టించినట్లే. వరల్డ్ కప్ లో ఒక్క ఓటమిని చవి చూడకుండా ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. ఇక సెమీ ఫైనల్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న భారత్ ను మరే జట్టు అధిగమించలేదు. దీంతో రోహిత్ సేన నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ లో తలపడనుంది. అది ఆస్ట్రేలియా కావచ్చు. న్యూజిలాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగితే పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ తోనైనా సెమీస్ లో తలపడే అవకాశాలు కొట్టి పారేయలేం అన్నది క్రీడా పండితుల అంచనాగా తెలుస్తుంది.