World Cup Semi Finals : వత్తిడి వద్దు.. సమిష్టి పోరాటమే ముద్దు.. ఫైనల్స్‌లోనూ మనమే
భారత్ ఈ నెల 15వ తేదీన న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్స్‌లో ముంబయి వాంఖడే స్టేడియంలో తలపడనుంది.
వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్‌లలో భారత్ తొమ్మిదింట తొమ్మిది గెలిచి సత్తా చాటింది. టేబుల్ టాపర్ గా నిలిచింది. వరల్డ్ కప్ లో ఓటమి అనేది ఎరగకుండా పయనిస్తున్న భారత్ ఈ నెల 15వ తేదీన న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్స్‌లో తలపడనుంది. ముంబయి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. ఆరోజు మనది కావడమే ముఖ్యం. అందుకే ఈ టెన్షన్ అంతా. తొమ్మిది మ్యాచ్ లు వరసగా గెలిచామన్న ఆనందం కన్నా సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ కు చేరాలన్న టెన్షన్ భారత్ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అది సహజమే. ప్రతి ఆట మనమే గెలవాలనుకుంటాం. అందులో తప్పేమీ లేదు.
గత వరల్డ్ కప్ లో...
2019లో సెమీ ఫైనల్స్ లో టీం ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఇది మంచి సమయం. భారత్ లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఒకరకంగా మనవైపే విక్టరీ మొగ్గు కొంత ఉంటుంది. దానికి ఆటగాళ్ల శ్రమ తోడయితే చాలు ఇక విజయం మనదేనన్న ధీమా అందరిలోనూ ఉంది. అందులోనూ టీం ఇండియా గతంలో కంటే బలంగా కనిపిస్తుంది. అన్ని ఫార్మాట్లలో కుర్రాళ్లు చెలరేగిపోతున్నారు. వికెట్లు తీయడంలోనూ, రన్స్ రాబట్టడంలోనూ భారత్ ఆటగాళ్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అవతలి జట్టు ఏదన్నది కాదు.. విజయమే ముఖ్యం అన్న తరహాలో ఇప్పటి వరకూ లీగ్ మ్యాచ్ లు సాగాయి.
అదే ఒరవడి...
సెమీ ఫైనల్స్ లోనూ అదే ఒరవడి చూపించాలని అందరూ కోరుకుంటున్నారు. ఆకాంక్షిస్తున్నారు. భారత్ గతంలో మాదిరిగా లేకపోవడమే ఆశలను మరింత పెంచిందనుకోవాలి. ఈసారి వరల్డ్ కప్ మనదేనన్న గట్టి కోరిక మనల్ని స్టేడియం వైపు పరుగులు తీయిస్తుంది. ఇప్పటి వరకూ ఈ వరల్డ్ కప్ లో ఓటమే ఎరుగని టీం ఇండియాకు మరో రెండు మ్యాచ్ లు కీలకమని చెప్పక తప్పదు. మైదానంలో జట్టు సమిష్టిగా ఆడగలిగితేనే కల సాకారమవుతుంది. ప్రధానంగా ఫీల్డింగ్ లోనూ కొంత ఇబ్బందులు పడుతున్న ఆటగాళ్లు దాని నుంచి బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సెమీ ఫైనల్స్ లో నెగ్గి ఫైనల్స్ కు దూసుకెళతారని విశ్వసిస్తున్నారు.
తీసిపారేయలేని...
రవిశాస్త్రి లాంటి వారు సయితం ఈ వరల్డ్ కప్ దక్కకుంటే మరో పన్నెండేళ్లు వెయిట్ చేయాలని అన్నారంటే టీం ఇండియాపై వత్తిడి మామూలుగా లేదు. వత్తిడి నుంచి బయటపడి ఆటపై దృష్టి పెట్టాలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. న్యూజిలాండ్ జట్టును తీసిపారేయలేం. ఆ జట్టు సమిష్టిగా రాణించిన మ్యాచ్ లు గతంలో అనేకం ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు ఈ వరల్డ్ కప్ లో తొలి నాళ్లలో దూకుడు ప్రదర్శించినా.. తర్వాత కాస్త నెమ్మదించింది. అలాగని లైట్ గా తీసిపారేయడానికి వీలులేదు. అందుకే టీం ఇండియా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 15వ తేదీన ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారనుంది.