T20 World Cup 2024 : నిరాశపర్చకుండా ఈరోజన్నా కాస్త బ్యాట్ కు పని చెప్పండి బాసూ
టీ 20 వరల్డ్ కప్ లో నేడు భారత్ కీలక మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో నెగ్గడం భారత్ కు అవసరం
టీ 20 వరల్డ్ కప్ లో నేడు భారత్ కీలక మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో నెగ్గడం భారత్ కు అవసరం. సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం అవసరం. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లు ఒక ఎత్తు. ఇక జరగబోయే మ్యాచ్ లు మరొక ఎత్తు. ప్రతి మ్యాచ్ భారత్ కు పరీక్ష లాంటిది. ఈ కఠిన పరీక్షలో నెగ్గుకు రావాలంటే ఏ ఒక్కరివల్లనో సాధ్యం కాదు. సమిష్టిగా రాణిస్తేనే విజయం తధ్యమన్నది క్రికెట్ నేర్పిన పాఠాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. గ్రౌండ్ లో కదలికలు.. బ్యాట్ తో చెప్పేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది అసలుకే ముప్పు తెస్తుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
భయపడే వారు...
విరాట్ కోహ్లి అంటే ప్రత్యర్థులు గడగడ లాడేవారు. భయపడే వారు. విరాట్ ను అవుట్ చేస్తే సగం గెలిచినట్లేనని ప్రత్యర్థులు భావించేవాళ్లు. కానీ అది మొన్నటి వరకూ. కానీ నేడు పరిస్థితి మారింది. ఈ టీ20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే విరాట్ కోహ్లి పెర్‌ఫార్మెన్స్ చాలా పూర్ గా ఉందని చెప్పాలి. మొన్న ఆప్ఘనిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో చేసిన 24 పరుగులే అత్యధికం కావడం విశేషం. ఎందుకంటే విరాట్ వెనువెంటనే అవుట్ అవుతుండటంతో ప్రత్యర్థులకు కోహ్లి అంటే భయం పోయింది. అయితే ఒక్కసారి విరాట్ నిలబడి పోరాడితే సులువుగా సెంచరీ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అందుకే కోహ్లి ఈ మ్యాచ్ లో అయినా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.
కెప్టెన్ కూడా...
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పెద్దగా ఆడటంలేదు. ఓపెనర్లదే అసలు సమస్య. వీరిద్దరూ త్వరగా అవుట్ అవుతుండటంతో మిగిలిన బ్యాటర్లపై వత్తిడి పెరుగుతుంది. దీంతో స్కోరు మందగించే అవకాశాలున్నాయి. పవర్ ప్లే లోనే వీలయినంత మేర పరుగులు సాధించి పెట్టడానికి ఓపెనర్లు ఇద్దరూ కష్టపడాలి. సత్తా చాటాలి. మిగిలిన వారంతా మంచి ఫామ్ లోనే ఉన్నారు. కానీ ఓపెనర్లు ఇద్దరూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. ఆరు ఓవర్లలోనే అనుకున్న పరుగులు సాధించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ అని, లెక్కలు మన వైపు ఉన్నాయని భావించకుండా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సూపర్ గా ఆడి మిగిలిన యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవాలని ప్రతి ఒక్క టీం ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.