World Cup 2023 : ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా సెమీస్ కే.. నేడు భారత్ - శ్రీలంక మ్యాచ్

వరసగా ఏడో విజయం కోసం భారత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. శ్రీలంకతో నేడు భారత్ తలపడనుంది.

Update: 2023-11-02 03:12 GMT

వరసగా ఏడో విజయం కోసం భారత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. శ్రీలంకతో నేడు భారత్ తలపడనుంది. ముంబయి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వరసగా ఆరు విజయాలతో ఊపు మీదున్న టీం ఇండియా ఈ మ్యాచ్ ను కూడా సులువుగా కొట్టేస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక ఈ వరల్డ్ కప్ లో వరెస్ట్ పెర్ ఫార్మర్ గా నిలవడంతో పాటు అన్ని విధాలుగా బలహీనంగా కనపడుతుండటంతో భారత్ విజయానికి ఏమాత్రం ఢోకా లేదన్న విశ్వాసం కనపడుతుంది. శ్రీలంకకు ఇది చావో రేవో మ్యాచ్. శ్రీలంక ఇక రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. అయితే అది ఎప్పుడైనా రైజ్ అయ్యే అవకాశాలున్నాయి.

వరస విజయాలతో...
రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ముంబయిలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ జట్టు సెమీస్ కు చేరినట్లే. ఇప్పటికే పన్నెండు పాయింట్లతో ఉన్న టీం ఇండియా పథ్నాలుగు పాయింట్లు సాధించి సెమీస్ కు చేరుకోగలుగుతుంది. ఇప్పటి వరకూ టీం ఇండియా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మీద గెలిచింది. ఛేదనలో టీం ఇండియాకు తిరుగులేకుండా ఉండి. బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉండటంతో స్కోరు బోర్డు పరుగులు తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో బౌలింగ్ పరంగా మనోళ్లు సత్తా చాటుతున్నారు. సరైన సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ తీస్తున్నారు.
ఫుల్ ఫామ్ లో...
బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అతడికి శుభమన్ గిల్ తోడయితే సునాయసంగా పరుగులు సాధించే వీలుంది. ఆ తర్వాత వచ్చే విరాట్ కొహ్లి ప్రదర్శన కూడా ఈ వరల్డ్ కప్ లో మామూలుగా లేదు. క్రీజులో నిలబడితే ప్రత్యర్థులకు చెమటలు పట్టడం ఖాయం. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, జడేజా వరకూ బ్యాటింగ్ ఆర్డర్ తిరుగులేకుండా ఉంది. అదే సమయంలో బౌలింగ్ లో షమి తన సత్తా చూపుతున్నాడు. వికెట్లు తీయకుండా బాల్ వెనక్కు తీసుకోవడం లేదు. షమి ఓవర్ వేస్తున్నాడంటే ఒక వికెట్ పడినట్లేనని అనుకోవాలి. ఇక బుమ్రా బంతిని పంపడంలో, వికెట్లు తీయడంలో దిట్ట. ఇక సిరాజ్ కొంత ఆడుతున్నా స్పిన్నర్లుగా కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తమ పాత్ర పోషిస్తూ ప్రత్యర్థి జట్టు నుంచి విజయాన్ని తమ వైపు లాగేసుకుంటున్నారు.
ఇది గెలిస్తే...
ఈ నేపథ్యంలో శ్రీలంకతో భారత్ జట్టు ఏ రకంగా ఆడుతుందన్న సందేహాలు ఎవరికీ లేకపోయినా ఉత్కంఠగా అయితే మ్యాచ్ ఉండనుంది. అయితే భారత్ జట్టులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ కు అవకాశమిస్తారంటున్నారు. సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. శ్రీలంక టీం ను తక్కువ అంచనా వేయకుండా అత్యధిక పరుగుల చేసి దానిని కట్టడి చేయడానికి టీం ఇండియా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో శ్రీలంకపై విజయం సాధించి వరసగా ఏడో విక్టరీ కొట్టి సెమీస్ కు వెళ్లాలన్నది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరిక.
Tags:    

Similar News