World Cup 2023 : మ్యాక్స్‌వెల్ వీర బాదుడు... డబుల్ సెంచరీతో సెమీ ఫైనల్‌కు

ఆస్ట్రేలియా - ఆప్ఘనిస్థాన్‌ల మధ్య మ్యాచ్ లో మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ చేశాడు

Update: 2023-11-08 04:40 GMT

వరల్డ్ కప్ లో మరో అద్భుతం. ఎవరూ ఊహించనది. వన్డే క్రికెట్ చరిత్రలో.. వరల్డ్ కప్ లో అరుదైన ఘట్టం. ఆస్ట్రేలియా - ఆప్ఘనిస్థాన్‌ల మధ్య మ్యాచ్ చూసిన వారెవరికైనా క్రికెట్ అంటే మరింత మక్కువ కలుగుతుంది. మ్యాక్స్‌వెల్ రెండు వందల పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అదేం కొట్టుడు. వీర బాదుడు. చూసిన వారి కళ్లు కూడా బైర్లు కమ్మేలా షాట్లు ఉన్నాయి. ఒక దశలో మ్యాక్స్‌వెల్ కండరాలు పట్టేసి కూలబడిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. అతని డబుల్ సెంచరీ వెనక ఎంతటి శ్రమ ఉందో. ఏపాటి కష్టముందో. ఆ ఒక్కటీ అర్థమయితే చాలు ప్రతి క్రికెట్ ఫ్యాన్ కూడా మ్యాక్స్ వెల్ పోరాటపటిమకు జేజేలు పలకాల్సిందే.

రెండు వందల పరుగులు చేసి...
ఆస్ట్రేలియా విజయానికి మ్యాక్స్‌వెల్ రెండు వందల పరుగులే కీలకం అని వేరు చెప్పాల్సిన పనిలేదు. ఒక దశలో ఆప్ఘనిస్థాన్ ది పై చేయిగా కనిపించింది. కానీ అక్కడ ఉన్నది మ్యాక్స్ వెల్. అతుక్కుపోయాడు. క్రీజుు వదిలి రానే రానన్నాడు. మొరాయించి... మొండికేసి మరీ బంతిని ఎగేసి, దిగేసి కొడుతూ పరుగులు తెచ్చి పెట్టాడు. ఫలితంగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 291 పరుగులు చేసింది. ఈ పరుగులు ఆస్ట్రేలియాకు పెద్ద కష్టమేమీ కాకపోయినా ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి అందరూ పెవిలియన్ బాట పట్టారు. ఎలాగంటే 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఇక గెలవలేదని టీవీలు ఆపేసిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆప్ఘాన్ గెలుస్తుందన్న నమ్మకంతో అంటిపెట్టుకుని చూసినవారు అనేకమంది ఉన్నారు.
సెమీ ఫైనల్స్ కు...
కానీ చివరకు మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించారు. మ్యాక్స్‌వెల్ పోరాట పటిమకు యావత్ క్రికెట్ ప్రపంచం జేజేలు కొడుతుంది. పాతుకుపోయిన మ్యాక్స్‌వెల్ ఆగలేదు. చెలరేగిపోయాడు. మైదానమంతా తనదేనన్నాడు. 201 పరుగులు తెచ్చి పెట్టాడు. ఒకవైపు కండరాలు నొప్పిపెడుతున్నా షాట్లను కొట్టేందుకు ఏమాత్రం తగ్గలేదు. చెలరేగిపోయాడు. బ్యాటింగ్ లో ఫ్యాన్స్ ను మరో ప్రపంచానికి తీసుకెళ్లాడ. రెండు సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్ నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాను సెమీస్ కు పంపాడు. ఆప్ఘనిస్థాన్ చేసిన పోరాటం మ్యాక్స్‌వెల్ ముందు వీలు కాలేదు. వారు పడిన శ్రమనంతా మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ బాది తన ఖాతాలో వేసుకున్నాడు. అదుకే క్రికెట్ అభిమానులంతా మ్యాక్స్‌వెల్ కు అభినందలు తెలుపుతున్నారు. ఈ వరల్డ్ కప్ లో పెద్దగా పెర్‌ఫార్మెన్స్ చూపలేకపోయాడన్న విమర్శల నుంచి బయటపడటమే కాదు రికార్డు నమోదు చేశాడు.


Tags:    

Similar News