T20 World Cup 2024 : పాక్ కు ఘోర పరాభావం.. పసికూన చేతిలో దారుణ ఓటమి
వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పాక్ తొలి మ్యాచ్ లోనే ఓటమిని చవి చూసింది.
వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పాక్ తొలి మ్యాచ్ లోనే ఓటమిని చవి చూసింది. అదీ క్రికెట్ లో ఊరు పెద్ద.. పేరు చిన్నగా ఉన్న అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలయింది. నిజానికి క్రికెట్ లో అమెరికా పెద్ద జట్టు ఏమీ కాదు. దానిపై అంచనాలు కూడా లేవు. అసలు అమెరికాలో క్రికెట్ ఉందా? అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది. అలాంటి అమెరికా చేతిలో పాక్ చిత్తయింది. అయితే ఈ విజయం సూపర్ ఓవర్ లో అమెరికాకు లభించింది. అసలు సూపర్ ఓవర్ వరకూ వచ్చిందంటే.. పాక్ అపజయం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది చూసి యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు మొత్తం ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడమే కాదు..క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు అని ఈ గేమ్ నిరూపించినట్లయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన...
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టును అమెరికా స్క్కాడ్ నిలువరించగలిగింది. పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అమెరికా జట్టు ముందు అది భారీ స్కోరు అనే చెప్పాలి. ఎందుకంటే అనుభవం, పెద్దగా పేరులేని ఆ జట్టు అంతటి స్కోరును ఎందుకు చేస్తుందన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలిగింది. పాక్ జట్టు కూడా అదే ధైర్యంతో ఉంది. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే టీ20 ఎందుకు అవుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టులో బాబార్ అజామ్ 44, షాదాబ్ ఖాన్ నలభై పరుగులు అత్యధికంగా చేశారు. మిగిలిన వాళ్లు చేతులెత్తేశారు. అమెరికా బౌలర్లు కెంజిగె మూడు , సౌరభ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచారు.
ఛేదనకు దిగి సూపర్ ఓవర్ లో...
తర్వాత ఛేదనకు దిగిన అమెరికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అమెరికా టీంలో మొనాంక్ పటేల్ అర్థ సెంచరీ చేయగా, అరోన్ జోన్స్ 36 నాటౌట్ గా నిలిచారు. అంద్రీస్ గౌస్ 35 పరుగులు చేశాడు. స్కోర్లు రెండు సమం కావడంతో సూపర్ ఓవర్ వచ్చింది ఈ సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా పద్దెనిమిది పరుగులు చేయగా, పాకిస్థాన్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ పాక్ ఓటమితో ప్రారంభించింది. అయితే పాక్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. కసితో అది మరింత రగలిపోయి రానున్న మ్యాచ్ లలో అది రైజ్ అవకాశాలు మాత్రం కొట్టిపారేయలేం.