T20 World Cup : ఆహా ఏమి భాగ్యము... భారత్ ఫైనల్స్ కు...ఇది కదా ఆశించింది.. కసి తీర్చుకున్న ఇండియా

టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ ను ఓడించి రారాజుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది

Update: 2024-06-28 04:41 GMT

టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి రారాజుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. 2022లో ఇంగ్లండ్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు భారత్ ధాటిగా బదులిచ్చింది. రిటర్న్ గిఫ్ట్‌ అంటే ఇంగ్లండ్ ప్లేయర్లకు రుచి చూపించింది టీం ఇండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించి నీటుగా.. కాలరెగరేసి మరీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. వర్షం ఇబ్బంది కలిగించినా, ఏ మాత్రం తడబడకుండా సమిష్టిగా రాణించింది. బ్యాటర్లు, బౌలర్లు తమ సత్తా ఏంటో రుచి చూపించారు. ఈ వరల్డ్ కప్ లో ఆది నుంచి టీం ఇండియా రాణిస్తుండటం చూస్తే ఖచ్చితంగా ఫైనల్స్ కు చేరుకోవడం ఖాయమని అందరూ అంచనా వేశారు.

కోహ్లి మరోసారి నిరాశపర్చినా...
అందరి అంచనాలను రోహిత్ సేన వమ్ము చేయలేదు. వర్షం పడటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో ముందు బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచారన్న విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ విస్మరించినట్లున్నాడు. అది కూడా ఇండియాకు ప్లస్ అయిందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రెండు ఓవర్లు పరవాలేదనిపించినా, కోహ్లి మరోసారి తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఒక సిక్సర్ బాది మరొక షాట్ కు ప్రయత్నించి వికెట్ ను కోహ్లి సమర్పించుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లి ఆశించనంత మేర ఆడకపోయినా మిగిలిన ఆటగాళ్లు మాత్రం తమ సత్తాను చాటారు.
ఇద్దరూ స్కోరు చేయడంతో...
తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా స్వల్ప పరుగులకే వెనుదిరిగాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ వచ్చి రోహిత్ శర్మతో జత కలిశాడు. రోహిత్ శర్మ ఎప్పటిలాగేనే మంచి ఇన్నింగ్స్ ఆడి 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసి అవుటయ్యాడు. హర్థిక్ పాండ్యా చివరిలో వచ్చి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా కూడా జత కలవడంతో భారత్ ఇరవై ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అయితే 171 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టులో బట్లర్ దూకుడుగా ఆడటంతో కొంత ఆందోళన తలెత్తింది. 23 పరుగులు చేసిన బట్లర్ ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో ఇక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపింది.
స్పిన్నర్ల దెబ్బకు...
ఇంగ్లండ్ బ్యాటర్లు వరస పెట్టి అవుటయ్యారు. సాల్ట్ ఐదు పరుగులకే అవుటయ్యాడు. బెయిర్ స్టో డకౌట్ కాగా, మొయిన్ ఆలీ 8 పరుగుల వద్ద రిషబ్ పంత్ స్టంప్ అవుట్ చేశాడు. దీంతో ఇరవై బాల్స్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ కధ ముగిసింది. భారత్ బౌలర్లలో బుమ్రా ఒకటి, అక్షర్ పటేల్, కులదీప్ చెరి మూడు వికెట్లు తీయడంతో మొత్తం 16.4 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి సెమీ ఫైనల్స్ నుంచి ఇంగ్గండ్ ఇంటి దారి పట్టింది. 2022 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో భారత్ ను ఓడించిన ఇంగ్లండ్ కు భారత్ తన పవరేంటో రుచి చూపించింది. ఇక ఈ నెల 29వ తేదీన సౌతాఫ్రికాతో భారత్ ఫైనల్స్ ఆడనుంది. ఫైనల్స్ లోనూ ఇదే జోరు కొనసాగించాలని భారత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. చిరకాల కోరిక వరల్డ్ కప్ ను సాధించాలని ఆశిస్తున్నారు.


Tags:    

Similar News