World Cup Semi Finals 2023 : పూనకాలు లోడింగ్... చితక్కొటారు కదా బాసూ.. ఇదే కదా మేం కోరుకున్నదీ..!

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు చేసింది

Update: 2023-11-15 12:22 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు చేసింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. యాభై ఓవర్లలో సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ కు భారీ టార్గెట్ ను విధించింది. న్యూజిలాండ్ లక్ష్యం 398 పరుగులుగా ఉంది. సెమీ ఫైనల్స్ మనోళ్లు వత్తిడిని ఎదుర్కొంటారని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. న్యూజిలాండ్ బాలర్లను చితకబాదేశారు. ఎలా అంటే చూసినోళ్లకే అర్థమవుతుంది. అది ఆనందమనాలా? ఆవేశమనాలా? చెప్పుకోలేని పరిస్థితి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆనందంతో కన్నీళ్లు ఆగని వాళ్లు కూడా లేకపోలేదు. సెమీ ఫైనల్స్ లోనూ ఇలా ఆడతారా? అన్న భయాన్ని తొలి పది ఓవర్లలోనే ఫ్యాన్స్ కు తొలగించారు.

సెమీ ఫైనల్స్ లో....
న్యూజిలాండ్ వంటి టీమ్ ను చితక్కొడుతుంటే అంతకంటే ఏముంటుంది? ప్రతి అభిమాని మదిలో ప్రశ్న ఇది. కుదురుగా కూర్చోలేని పరిస్థితి. చప్పట్లు కొడుతూనే ఉండి చేతులు నొప్పి పుట్టాయంటే నమ్మశక్యంగా లేదు కదూ. అవును. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అందరూ అంతే. రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి నాలుగు సిక్సర్లు బాదితే మన చేతులు ఊరుకుంటాయా? రోహిత్ శర్మ 47 పరుగుల వద్ద అవుటయినప్పుడు కొద్దిగా బాధ అనిపించినా వెంటనే శుభమన్ గిల్ ఆ బాధ స్థానంలో హ్యాపీనెస్ ను నింపేశాడు. ఎంతగా అంటే గిల్ మరో ఐదు ఓవర్లు ఆడితే సెంచరీ చేస్తాడనే విధంగా. కానీ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయివెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఏ ఒక్కరినీ వదిల్లేదు. కాస్కోండిరా.. మా తడాఖా అంటూ 2019 వరల్డ్ కప్ లో తమపై నెగ్గిన న్యూజిలాండ్ పై ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు అనిపించింది.
అందరూ అంతేగా....
ఇక తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఊరికే ఉన్నాడా? అంటే లేదు కుర్రోడు జబ్బల రుచిని న్యూజిలాండ్ కు రుచిచూపించాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 105 పరుగుల చేసి అవుటయ్యాడు. వరసగా నెదర్లండ్స్ పై, న్యూజిలాండ్ పై బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. ఇక విరాట్ కోహ్లి 117 పరుగుల వద్ద అవుటయ్యాడు. విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ లో యాభైవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నా సామిరంగా అన్నట్లు సిక్సర్లు బాదాడు. రన్ మెషీన్ వాంఖడే స్టేడియంలో రగ్బీ ఆడనట్లుంది. అలా ఆటాడుకున్నాడు మనోడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత చెలరేగి సిక్సర్లు బాదాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. విరాట్ అవుటయిన తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా సిక్సర్లు, ఫోర్లతో రఫ్ ఆడించేశాడు. దీంతో స్కోరు బోర్డు మరింత పరుగులు తీసింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. న్యూజిలాండ్ ఛేదనలో శ్రమించాల్సక తప్పని పరిస్థితిని కల్పించారనడంలో అతిశయోక్తి లేదు.


Tags:    

Similar News