World Cup 2023 : ఇది కదా కోరుకున్నది... నువ్వు దేవుడివయ్యా మాకు

పుట్టిన రోజు తనకు తాను మాత్రమే కాదు యావత్ భారతదేశానికి విరాట్ కోహ్లి అద్భుతమైన కానుకను అందించాడు

Update: 2023-11-05 12:57 GMT

దటీజ్ విరాట్ కోహ్లి. తన పుట్టిన రోజు తనకు తాను మాత్రమే కాదు యావత్ భారతదేశానికి అద్భుతమైన కానుకను అందించాడు. ఈడెన్ గార్డెన్స్ లో చెలరేగి ఆడిన విరాట్ కోహ్లి తన పుట్టిన రోజు 49వ సెంచరీ చేసి సచిన్ రికార్డులను సమం చేసాడు. మరొక సెంచరీ చేస్తే చాలు ఇక రికార్డులన్నీ కోహ్లి ఖాతాలో చేరిపోతాయి. రోహిత్ శర్మ అవుట్ కాగానే బరిలోకి దిగిన కోహ్లి నిదానంగా.. నింపాదిగా ఆడాడు. పుట్టిన రోజు నాడు తన ‌ఫ్యాన్స్ ను నిరాశపర్చ కూడదనుకున్నాడు అనుకున్నట్లుంది. అందుకే మిగిలిన ఆటగాళ్లు అవుట్ అవుతున్నా కోహ్లి మాత్రం నిలదొక్కుకుని, మరోసారి భారత్ క్రెకెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని చుర్రున లాగేశాడు.

పులిలా పరుగులు పెట్టి....
101 పరుగుల చేసిన విరాట్ కోహ్లి భారత్ కు భారీ పరుగులు తెచ్చి పెట్టాడనే చెప్పాలి. విరాట్ వికెట్ల మధ్య పరుగుల వేగాన్ని చూస్తే పులి అనాలా? జింక అనాలా? తెలియక ప్రత్యర్థులు తలపట్టుకునే పరిస్థితి కల్పించాడు. విరాట్ సాధారణంగా రన్ అవుట్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని ప్రత్యర్థులకు ఎవరికీ ఇవ్వడు. వికెట్ల మధ్య పరుగు తీయాలంటే విరాట్ కు అవతి వైపు ఉన్న టీం ఇండియా ప్లేయర్ జెర్సీ తడిసి ముద్దయి పోతుంది. అంతగా పరుగులు పెట్టిస్తాడు. తను తీస్తాడు.
మరో రికార్డు....
విరాట్ కు ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్. పుట్టిన రోజు శతకం బాదతాడా?లేదా? అనుకున్న అభిమానుల సందేహాలను పటాపంచలను చేసేశాడు. 119 బంతులలో పది ఫోర్లతో కోహ్లి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది అరుదైన ఘనత అని చెప్పక తప్పదు. ఇలా ఆడుతుంటే విరాట్ కు అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరగడమే కాని తగ్గడమనేది ఎందుకుంటుంది. సోషల్ మీడియాలో బర్త్‌డే బాయ్ కు సెంచరీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే టూ యూ బేబీ... అలాగే రికార్డుల రారాజుకు తెలుగుపోస్ట్ జేజేలు పలుకుతుంది.


Tags:    

Similar News