World Cup 2023 : చిన్న జట్టే మేలు.. ఒక గేమ్ అయినా సరిగా ఆడుతోంది
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరల్డ్ కప్ చూపిస్తున్న ప్రతిభను చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంది
ఒక్కప్పుడు ఆ జట్టంటే ఎంత భయపడే వారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. ఎన్ని శతకాలు.. ఎన్ని అర్థశతకాలు.. ఇటు బౌలింగ్ పరంగా.. అటు బ్యాటింగ్ పరంగా బలంగా ఉండే ఆ జట్టులో ఎందుకు ఇంత నిస్సత్తువ మొదలయింది? అసలు వీళ్లేనా వరల్డ్ కప్ ను గెలుచుకున్నది అన్న అనుమానం ప్రతి వారికి కలిగిస్తున్నారు. ఇంత ఛండాలంగా ఆడుతున్న జట్టు బహుశ పది జట్లలో ఏదీ లేదనే చెప్పాలి. చివరకు పసికూనలని భావించిన ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా సత్తా చాటుతున్నాయి. రెండు వందల స్కోరు పైనే చేస్తున్నాయి. ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మాత్రం కారణాలు తెలియదు కానీ... చిన్న జట్టు కన్నా అతి చిన్నదిగా కనిపిస్తుంది.
ఓటములే ఎక్కువ...
ఢిఫెండింగ్ చాంపియన్‌కు ఎన్ని కష్టాలు. ఈ వరల్డ్ కప్ మొదలయింది మొదలు ఓటములు ఎక్కువ. ప్రత్యర్థి చిన్న జట్టైనా సరే చతికలపడటం ఇంగ్లండ్ జట్టుకు అలవాటుగా మారింది. ఆప్ఫనిస్తాన్ జట్టుమీద కూడా ఇంగ్లండ్ ఓటమి పాయింది. ఎందుకో ఈ పరిస్థితి తాజాగా శ్రీలంక మీద కూడా అతి తక్కువ పరుగులు చేసింది. కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే రన్ రేట్ కేవలం 3.2 కూడా లేదు. శ్రీలంక లక్ష్యం కేవలం 157 పరుగులు మాత్రమే. ఇది శ్రీలంకకు పెద్దగా ఛేజింగ్ స్కోరు కాకపోవచ్చు.
తక్కువ పరుగులకే ఆల్ అవుట్...
156 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 33 పరుగులకే ఆట ముగించేశారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సరే.. బ్యాటింగ్ అయినా సరిగా చేసిందా? అంటే అదీ లేదు. వచ్చిన బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్లి పోయారంతే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో 33 ఓవర్లకే ఇంగ్లండ్ ఆల్ అవుట్ కావడంతో గేమ్ చూద్దామని వచ్చిన వాళ్లు కూడా నిరాశకు గురయ్యారు. కనీసం శ్రీలంక బౌలర్లను ఒక ఆటాడుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి.
ఏ ఒక్కరూ కూడా...
ఇంగ్లండ్ జట్టులో ఏ ఒక్కరు అర్ధ శతకం చేయలేకపోయారు. బెన్‌స్టోక్ మాత్రమే 43 పరుగులు చేయగలిగాడు. అతడే టాప్ స్కోరర్. బెయిర్ స్టో 30 పరుగులు, డేవిడ్ మలన్ 28 పరుగులు చేసి పరవాలేదనిపించారు. మిగిలన హేమాహేమీలంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఇక శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార మూడు, ఏంజెలో మాథ్యూస్ రెండు, కాసున్ రజిత రెండు, మహీశ్ తీక్షణ ఒక్క వికెట్ తీశారు. ఇప్పుడు శ్రీలంక ఛేదన మొదలయింది. పెద్దగా కష్టపడకుండానే శ్రీలంక గెలిచే అవకాశాలున్నాయన్నది క్రీడా విశ్లేషకుల అంచనా.