T20 World Cup 2024 : టీ 20 ప్రపంచ కప్ కు అంతా సిద్ధం.. దాయాది దేశంతో పోరు ఎప్పుడంటే?
ఐపీఎల్ ముగిసింది. ఇక వరల్డ్ కప్ టీ 20 మొదలు కానుంది. మరో ఐదు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. క్రికెట్ ఫ్యాన్స్ దాదాపు రెండు నెలలు మంచి క్రికెట్ ను ఆస్వాదించారు. గెలుపోటములు ఎలా ఉన్నా అనేక మ్యాచ్ లలో చివరి బంతి వరకూ టెన్షన్ పెట్టారు. అంచనాలు అందని జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. అలాగే భారీ అంచనాలున్న జట్లు ముందుగానే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి. చివరకు ప్లే ఆఫ్ లో కూడా అనుకున్నది జరగలేదు. అందరూ అనుకున్నట్లు జరగకపోవడమే పొట్టి కప్ ప్రత్యేకత. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఫైనల్స్ చేరుకుంటుందని వేసుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. అది కష్టపడి ప్లేఆఫ్ కు చేరుకున్నా అక్కడి నుంచి వైదొలిగింది. ఇక ఫైనల్స్ లో భీకర పోరు జరుగుతుందని భావించినా ఆట ఉత్తుత్తిగానే తేలిపోయింది.
ఉత్కంఠ పోరు...
ఐపీఎల్ ముగిసింది. ఇక వరల్డ్ కప్ టీ 20 మొదలు కానుంది. మరో ఐదు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లన్నీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి. అంటే అందరూ కార్యాలయాల నుంచి వచ్చి తీరిగ్గా టీవీల ముందు కూర్చుని మంచి క్రికెట్ ను ఆస్వాదించవచ్చు. ఇది ఐపీఎల్ కాదు. వరల్డ్ కప్ కావడంతో దేశాల మధ్య పోరు. ఉత్కంఠగా జరుగుతుందన్నది మాత్రం వాస్తవం. అన్నీ మేటి జట్లే. ఎవరినీ ఎవరు తక్కువగా అంచనా వేసినా అది పొరపడినట్లే. మైదానంలో ఆరోజు ఎవరు పెర్‌ఫార్మెన్స్ చూపగలిగితే వారిదే పైచేయి. ఇందులో చిన్న, పెద్ద జట్టు అనేది లేదు. అంచనాలు కూడా వేయడం అనవసరం. ఈసారి టీ 20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ లో జరగనుంది. మ్యాచ్ లన్నీ అక్కడే జరగనున్నాయి. అక్కడ మైదానాలు అలవాటున్న జట్లు పుంజుకుంటాయి.
ఇరవై టీంలు...
మొత్తం ఇరవై జట్లు 55 మ్యాచ్ లు ఆడతాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది. భారత్ జట్టు ఇప్పటికే అమెరికా చేరుకుంది. ఇందులో జూన్ 5వ తేదీన న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా తలపడనుంది. ఆ తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న అమెరికాతో ఆడనుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ను జూన్ 15న కెనడాతో తలపడుతుంది. గ్రూప్-ఎలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ జట్లున్నాయి. గ్రూప్ సిలో ఆప్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్ లు ఉన్నాయి. గ్రూప్ డి లో బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లున్నాయి. ఇక ప్రపంచ కప్ పండగ కోసం అభిమానులు ఐదు రోజులు వెయిట్ చేయాల్సిందే.