Ys Jagan : ఏమయ్యా జగనూ ఇకనైనా మేల్కొనకపోతే... ఇక అంతే సంగతులు
ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ పూర్తిగా కష్టాల్లో పడింది. వైఎస్ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ పూర్తిగా కష్టాల్లో పడింది. ఎంతగా అంటే పీకల్లోతున కూరుకుపోయింది. దానిని బయటకు తీయాలంటే అది జగన్ వల్లనే సాధ్యం. కానీ జగన్ తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు. ఉండేవారు ఉంటారు.. వెళ్లేవారు వెళతారులే అన్నట్లు జగన్ వైఖరితో పార్టీ నేతలు కూడా విసిగిపోతున్నారు. లీడర్లను ఓటమి నుంచి బయటపడటానికి వారిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన పార్టీ చీఫ్ నాలుగు గోడలకే పరిమితమయ్యారు. అయితే బెంగళూరు లేకపోతే.. బెజవాడ... అలా కాకుంటే పులివెందుల ఈ మూడు ప్రాంతాలకే జగన్ ఎక్కువగా పరిమితమయ్యారు.
నేతలు వెళుతున్నా...
మరోవైపు టీడీపీ దూకుడుగా ఉంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను దక్కించుకోవడానికి ఆ పార్టీ ఆ రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలకు వల వేస్తుంది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు వెళ్లిపోయారు. మరొక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా గుడ్ బై చెప్పారు. అయినా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టడానికి వైఎస్ జగన్ కు సమయం లేదా? అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంత ధైర్యాన్ని నింపితే వలసలు ఆగుతాయి కదా? అన్నది నేతల నుంచి వినిపిస్తున్న మాట. అందులో వాస్తవమే ఎక్కువగా ఉంది. కానీ పార్టీలో ఉండాలని బతిమాలడం వైఎస్ జగన్ కు ఇష్టం లేనట్లుంది. ఆయన ఇగోను దెబ్బతీస్తుందని కొందరు నేతలు అన్న మాట నిజమేనని అనుకోక తప్పదు.
వంద రోజులు గడవక ముందే...
పార్టీ ఓడిపోయి వంద రోజులు గడవక ముందే ముఖ్యమైన నేతలు, నమ్మకమైన మిత్రులు వైసీీీపీని వీడి వెళుతుంటే వైఎస్ జగన్ ఇంకా మేలుకోకపోతే ఎలా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. నియోజకవర్గాల నుంచి నేతలను పిలిపించుకుని మాట్లాడటమో, లేక జిల్లాల వారీగా వైసీపీ నేతలతో జగన్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని కొందరు నిలదీస్తున్నారు. ఓటమి నుంచి జగన్ బయటపడలేదన్న సంకేతాలను క్యాడర్ లో పంపడానికేనా? అని నిలదీస్తున్నారు. ఇలా అయితే ఎలా పార్టీని నడపటం అంటూ ఒకింత నైరాశ్యంలో ఉన్నారు. నిజానికి జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టకపోయినప్పటికీ నేతలతో సమావేశమై పార్టీకి భవిష్యత్ ఉంటుందన్న భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఓటమి తర్వాత కూడా...
అయితే వైఎస్ జగన్ మాత్రం నేతలతో ఎక్కువగా ముఖాముఖి నిర్వహించేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. రోజుకొక నేత పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కనీసం వారిని ఆపేందుకు సీనియర్ నేతలనయినా రంగంలోకి దించితే బాగుంటుంది కదా అన్న సూచనలు వినిపిస్తున్నాయి. కానీ జగన్ ఎవరి మాట వినని అందరికీ తెలుసు. తాను అనుకున్నదే చేస్తారు తప్పించి మరొకరి సలహా ఆయన స్వీకరించరు. గతంలో అంతే. ఓటమి తర్వాత కూడా అంతేనా? అంటూ నేతల్లో పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఇలాగే జగన్ వైఖరి కొనసాగితే వైసీపీ ఏపీలో ఖాళీ కాకతప్పదన్న ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతుంది.