Free Gas Cylinder : ఉచిత గ్యాస్ సిలిండర్ ను వినియోగించుకుంది అరకోటి మంది

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం దీపావళి నుంచి ప్రారంభమయింది

Update: 2024-11-22 11:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం దీపావళి నుంచి ప్రారంభమయింది. ఇప్పటి వరకూ మూడు వారాల్లో దీపం 2 పథకం కింద యాభై లక్షల మంది లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ కంపెనీలు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1 కోటి 55 లక్షల 200 ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్న నాదెండ్ల దీపం-2 పథకంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలిపారు. అర్హులైన చివరి లబ్ధిదారు వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ, కృష్ణ‌లంక‌లోని కోత మిష‌న్ రోడ్డు ప్రాంతంలో జ‌రిగిన దీపం-2 ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ పాల్గొని ల‌బ్ధిదారు ఎం.కోటేశ్వ‌ర‌మ్మ, కుటుంబ స‌భ్యుల‌తో ముచ్చ‌టించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ....
ఈ సంద‌ర్భంగా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 55 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయ‌ని.. దీపావళి పండుగ రోజు ప్రతి మహిళ క‌ళ్ల‌ల్లో సంతోషం నింపే విధంగా అర్హ‌త ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందించే దీపం-2 ప‌థ‌కాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో లాంఛ‌నంగా ప్రారంభించార‌ని.. ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమ‌లవుతోంద‌ని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు 1999లో దేశంలోనే మొదటిసారిగా మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి క‌ట్టెల పొయ్యి పొగ‌తో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో దీపం పథకాన్ని ప్రారంభించార‌ని వివ‌రించారు. గ్యాస్ క‌నెక్ష‌న్‌, ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు ఉంటే చాల‌ని ఇప్పుడు దీపం-2 ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిపొందొచ్చ‌న్నారు. ప్రతిపక్షాలు, మాజీ సీఎం జగన్ కావాల్నా దుష్ప్రచారం చేస్తున్నారని, గ్యాస్ కనెక్షన్ల సంఖ్యపై కూడా అవగాహన లేకుండా కోటి 85 లక్షలు అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌న్నారు. మూడు గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలో కోటి 55 ల‌క్ష‌ల 200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప‌థ‌కం అందేలా రూ. 894 కోట్ల అడ్వాన్సును గ్యాస్ కంపెనీల‌కు అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు.


Tags:    

Similar News